పర్యాటక ‘భాగ్య’ం

ABN , First Publish Date - 2022-09-27T07:02:53+05:30 IST

ముత్యాల నగరంగా పేరొందిన హైదరాబాద్‌కు ఒకసారి వచ్చిన వారు.. మళ్లీ మళ్లీ వచ్చే విధంగా ఇక్కడి పర్యాటకం ఆకట్టుకుంటోంది.

పర్యాటక ‘భాగ్య’ం

ఏటా లక్షలాది మంది సందర్శన 

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): ముత్యాల నగరంగా పేరొందిన హైదరాబాద్‌కు ఒకసారి వచ్చిన వారు.. మళ్లీ మళ్లీ వచ్చే విధంగా ఇక్కడి పర్యాటకం ఆకట్టుకుంటోంది. ఏడాది పొడవునా దేశ, విదేశాల పర్యాటకులు నగర పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. నగరంలోని చారిత్రక ప్రాంతాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. 1591లో కులీకుతుబ్‌షా హయాంలో నిర్మించిన చార్మినార్‌ మొదలుకుని దుర్గం చెరువు వరకు చెప్పుకుంటూ పోతే నగరంలో పర్యాటక ప్రాంతాలెన్నో. ఇక హుస్సేన్‌సాగర్‌లో బోటింగ్‌కు మరింత క్రేజ్‌ ఉంది. ఇక్కడికి వచ్చే వారిలో 65 శాతం మంది సాగర్‌లో తప్పకుండా బోటింగ్‌ చేస్తారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి వద్దా బోటింగ్‌ సదుపాయం ఉంది. 

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు..

 భాగ్యనగర టూరిజం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. జోన్స్‌ లాంగ్‌ లాసాల్లే (జేఎల్‌ఎల్‌) సిటీ మొమెంటం ఇండెక్స్‌-2020లో వరల్డ్‌ మోస్ట్‌ డైనమిక్‌ సిటీగా ఎంపిక చేశారు. దేశంలోని 34 నగరాల్లో ఏడాది క్రితం ‘డెస్టినేషన్‌ డిస్కవరీ వెబ్‌సైట్‌ హాలిడేఫై.కామ్‌’ సర్వేలో నగరం ముందు వరసలో ఉంది. 

 కొవిడ్‌ నుంచి గట్టెక్కుతూ..

కొవిడ్‌తో భాగ్యనగర పర్యాటకం పూర్తిగా కుదేలైంది. అప్పట్లో పర్యాటక శాఖకు నెలకు రూ. 2 కోట్ల వరకు ఆదాయం వచ్చేది.  ప్రస్తుతం నగర పర్యాటకం పుంజుకుంది. సెలవు రోజుల్లో పర్యాటకుల సంఖ్య పెరిగింది. దేశీయ టూరిస్టులతోపాటు పనులు నిమిత్తం నగరానికి వచ్చే విదేశీయులు చారిత్రక ప్రాంతాలను సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు. 


టూరిజం హబ్‌గా

 ప్రభుత్వ సహకారంతో తెలంగాణ పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే హరిత హోటళ్ల నిర్వహణను మెరుగుపరిచి ఆయా ప్రదేశాల్లో పర్యాటకులకు తెలంగాణ రుచుల భోజనాన్ని అందిస్తున్నాం. నగర పర్యాటకాన్ని  టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం.

-ఉప్పల శ్రీనివా్‌సగుప్తా, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌

Read more