‘రైతుబంధు’కు సమాయత్తం!

ABN , First Publish Date - 2022-12-10T03:00:51+05:30 IST

యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు నగదు బదిలీ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది.

‘రైతుబంధు’కు సమాయత్తం!

నేటి క్యాబినెట్‌ భేటీలో తేదీల ఖరారు..

నిధులు సర్దుబాటుపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు నగదు బదిలీ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. శనివారం నిర్వహించే క్యాబినెట్‌ సమావేశంలో నిధుల లభ్యతపై చర్చించి తేదీలను ఖరారుచేసే అవకాశముంది. మూడు రోజుల క్రితం జగిత్యాలలో నిర్వహించిన బహిరంగసభలో సీఎం కేసీఆర్‌ ‘రైతుబంధు’ అంశాన్ని ప్రస్తావించారు. పది, పన్నెండు రోజుల్లో రైతుబంధు నిధులు చెల్లిస్తామని, ఈమేరకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ చెప్పారు. ఈ క్యాబినెట్‌ సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలతోపాటు రైతుబంధు నిధుల పంపిణీ పైనా చర్చించనున్నారు. సుమారు 65 లక్షల మంది రైతుబంధు లబ్ధిదారులు ఉండగా... రూ. 7,434 కోట్ల నిధులు అవసరమవుతాయి. నిధులు సర్దుబాటైతే ఈనెల చివరివారంలో నగదు బదిలీ ప్రారంభించి, జనవరి నెలలో సంక్రాంతి లోపు ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. గతంలో మాదిరిగానే ఈసారి కూడా రోజుకో ఎకరం చొప్పున పెంచుకుంటూ, ఆరోహణ క్రమంలో నగదు బదిలీ చేయనున్నారు.

Updated Date - 2022-12-10T03:01:04+05:30 IST