టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడి నుంచి పార్శిల్‌ వచ్చింది

ABN , First Publish Date - 2022-11-16T03:04:51+05:30 IST

హైదరాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): బీజేపీ దాఖలు చేసిన అప్పీల్‌ విచారణ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ సంచలన విషయాలు వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడి నుంచి తన కార్యాలయానికి ఓ పార్శిల్‌ అందిందని తెలిపారు.

టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడి నుంచి పార్శిల్‌ వచ్చింది

అందులో సీడీ, ఇతర మెటీరియల్‌ ఉన్నాయి

వాటిని మేమేం చేసుకోవాలి..? ఇది పద్ధతేనా?

ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన సీజే భుయాన్‌

హైదరాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): బీజేపీ దాఖలు చేసిన అప్పీల్‌ విచారణ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ సంచలన విషయాలు వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడి నుంచి తన కార్యాలయానికి ఓ పార్శిల్‌ అందిందని తెలిపారు. అందులో ఓ సీడీ, ఇతర మెటీరియల్‌ ఉన్నాయన్నారు. ఇలాంటి పార్శిలే తమకు కూడా అందిందని తన సహచరుడు, మరో హైకోర్టు సీజే నుంచి ఫోన్‌ వచ్చిందని ఓపెన్‌ కోర్టులో బహిరంగంగా వెల్లడించారు. ‘ఆ పార్శిల్‌ను మేం ఏం చేయాలి..? ఇలా చేయడం సమంజసమేనా?’ అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది దుష్యంత్‌ దవేను ప్రశ్నించారు. అలా చీఫ్‌ జస్టిస్‌ కార్యాలయానికి పార్శిల్‌ పంపడం చాలా విచారకమరని దుష్యంత్‌ దవే అన్నారు. ఈ విషయం తనకు తెలియదని, ఇలాంటి చర్యలను తాను సమర్థించనని తెలిపారు. ఇలా జరిగినందుకు క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. చీఫ్‌ జస్టి్‌సకు ఎదురైన ఇబ్బందికరమైన పరిస్థితికి మన్నించాలని కోరారు. సదరు పార్శిల్‌ను పట్టించుకోవద్దని, దాన్ని పక్కన పడేయాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ తరఫున హాజరైన వైద్యనాథన్‌ చిదంబరేశ్‌ ఈ అంశంపై వాదనలు వినిపిస్తూ.. తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఇలా చీఫ్‌ జస్టిస్‌ కార్యాలయానికి పార్శిల్‌ పంపడం గతంలో ఎన్నడూ చూడలేదని, సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టి్‌సకి కూడా పార్శిల్‌ పంపారని తనకు ఇప్పుడే తెలిసిందని పేర్కొన్నారు. ఇది మొత్తం న్యాయ వ్యవస్థను ప్రభావితం చేయడమేనని.. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాలని కోరారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడి నుంచి ఓ పార్శిల్‌ వచ్చిందని తీర్పులో ప్రస్తావించింది. ఇందుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది క్షమాపణ తెలియజేసినట్లు కూడా పేర్కొనడం గమనార్హం.

ఎగ్జిక్యూటివ్‌, పొలిటికల్‌ అథారిటీ అంటే..?

హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తన తీర్పులో ఆసక్తికరమైన ఆదేశాలు జారీచేసింది. సిట్‌ చైర్మన్‌, డీజీ ర్యాంకు అధికారి అయిన సీవీ ఆనంద్‌ తమ ఆదేశాల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది. దర్యాప్తు వివరాలను హైకోర్టుకు తప్ప మరెవరికీ రిపోర్ట్‌ చేయరాదని స్పష్టం చేసింది. సీవీ ఆనంద్‌ తన విధుల గురించి సాధారణంగా రిపోర్ట్‌ చేసే డీజీపీ మహేందర్‌రెడ్డి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఎగ్జిక్యూటివ్‌ అథారిటీ కిందకి వస్తారు. అలాగే రాజకీయ అథారిటీ అంటే హోంమంత్రి, ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ఈ నలుగురిలో ఎవరికీ కేసు దర్యాప్తు వివరాలు వెల్లడించే అవకాశం లేకుండా సిట్‌ను హైకోర్టు కట్టడి చేసినట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

హైకోర్టు ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం: సంజయ్‌

హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. సిటింగ్‌ జడ్జి పర్యవేక్షణలో సిట్‌ విచారణ కొనసాగాలన్నదే తమ అభిప్రాయమని చెప్పారు. హైకోర్టు ఉత్తర్వులతో విచారణ పారదర్శకంగా జరిగే అవకాశం ఉందని ఓ ప్రకటనలో పేర్కొనారు. బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి తమ పార్టీపై ఆరోపణలు చేయడమే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు.

Updated Date - 2022-11-16T06:04:53+05:30 IST

Read more