టెండర్లు వేశారోచ్‌..!

ABN , First Publish Date - 2022-12-13T03:28:45+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు, కల్వర్టులు, వంతెనల నిర్మాణం కోసం కాంట్రాక్టర్ల నుంచి ఎట్టకేలకు టెండర్లు దాఖలయ్యాయి.

టెండర్లు వేశారోచ్‌..!

రోడ్ల మరమ్మతులకు ఎట్టకేలకు టెండర్లు

ఊపిరిపీల్చుకున్న మంత్రి, అధికారులు

హైదరాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు, కల్వర్టులు, వంతెనల నిర్మాణం కోసం కాంట్రాక్టర్ల నుంచి ఎట్టకేలకు టెండర్లు దాఖలయ్యాయి. కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనేందుకు అధికారులు చేసిన కృషితోపాటు మంత్రుల బ్జుజగింపులు ఫలించాయి. దీంతో రోడ్లు, భవనాల శాఖ మంత్రి, సంబంధిత అధికారులు ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి డిసెంబరు 5న ‘టెండర్లు వేయండి ప్లీజ్‌’ అనే శీర్షికన ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టర్లు స్పందించడంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 శాతం టెండర్లు దాఖలయ్యాయి. కాగా.. ఇప్పటివరకు దాఖలైన టెండర్లలో నల్గొండ జిల్లాలో తక్కువగా రాగా... ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 75 టెండర్లు దాఖలయ్యాయి. దీంతో అధికారులు తదుపరి చర్యలపై దృష్టి సారించారు. ప్రస్తుతం దాఖలైన టెండర్లన్నింటినీ జిల్లా స్థాయిలోనే తనిఖీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాడైపోయిన రోడ్లకు మరమ్మతులు చేయడంతోపాటు... మార్గమధ్యంలో కల్వర్టులు, వంతెనలను నిర్మించాలని సీఎం కేసీఆర్‌ పలు సందర్భాల్లో ఆర్‌ అండ్‌ బీ శాఖను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు... ఆయా పనులకు సంబంధించిన అంచనాలను ఖరారు చేశారు. ఈ మేరకు మొదటి విడత కింద 4వేల కిలోమీటర్ల మేర రోడ్లకు మరమ్మతులు చేయాలని ప్రభుత్వానికి నివేదించారు. దీంతోపాటు కల్వర్టులు, వంతెనల నిర్మాణానికి కలిపి దాదాపు రూ.2,500 కోట్ల నిధులు అవసరమవుతాయని పేర్కొన్నారు. డిసెంబర్‌ 10న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఈ మేరకు నిధుల మంజూరుకు పచ్చజెండా ఊపారు. రోడ్ల మరమ్మతులకు రూ.1,870 కోట్లతోపాటు కల్వర్టులు, వంతెనల నిర్మాణానికి మరో రూ.670 కోట్ల నిధులను అందించనున్నట్టు తెలిపారు.

15 నాటికి వర్క్‌ అగ్రిమెంట్‌లు పూర్తి

ప్రస్తుతం ఆర్‌ అండ్‌ బీ శాఖ ఆహ్వానించిన టెండర్లలో 80 శాతం పూర్తయ్యాయి. మంగళవారం కూడా కొన్ని జిల్లాల్లో టెండర్లు దాఖలు కానున్నట్టు తెలుస్తోంది. దీంతో రెండు మూడ్రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. వర్క్‌ అగ్రిమెంట్లకు సంబంధించిన ప్రక్రియను డిసెంబర్‌ 15 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి అధికారులకు ఇప్పటికే సూచించారు. అయితే టెండర్ల దాఖలుకు చివరి తేదీని మాత్రం ప్రకటించలేదు. దీంతో మంగళ, బుధవారాల్లో కూడా టెండర్లు దాఖలయ్యే అవకాశం ఉందని సమాచారం. అధికారుల నివేదిక మేరకు రాష్ట్రంలోని 9 సర్కిళ్లలో రోడ్లకు మరమ్మతులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా వరంగల్‌ సర్కిల్‌లో 461 కిలోమీటర్లు, ఖమ్మంలో 440, కరీంనగర్‌లో 566, మెదక్‌లో 515, నల్గొండలో 713, మహబూబ్‌నగర్‌లో 547, ఆదిలాబాద్‌లో 358, రంగారెడ్డి రూరల్‌లో 299, నిజామాబాద్‌లో 336 కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు చేయనున్నారు.

కాంట్రాక్టర్లకు బడ్జెట్‌ టెన్షన్‌

రోడ్ల మరమ్మతులు, కల్వర్టులు, వంతెనల నిర్మాణానికి అవసరమైన బడ్జెట్‌కు ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా, కాంట్రాక్టర్లు మాత్రం కలవరపడుతున్నట్టు తెలుస్తోంది. గతంలో చేపట్టిన కొన్ని పనులకు ఇంతవరకు నిధులు విడుదల చేయలేదని మంత్రులు, అధికారుల వద్ద కాంట్రాక్టర్లు వాపోతున్నారు. కొత్త వర్క్‌లు చేయడానికి కాంట్రాక్టర్లు అంతగా ఆసక్తి చూపించలేదు. మరోవైపు... ఇప్పటికే ఆర్‌ అండ్‌ బీలో దాదాపు రూ.800 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

Updated Date - 2022-12-13T03:28:45+05:30 IST

Read more