టీ20 టికెట్లు బ్లాక్‌

ABN , First Publish Date - 2022-09-25T07:19:57+05:30 IST

ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం జరిగే 3వ టీ20 మ్యాచ్‌ సిరీ్‌సను డిసైడ్‌ చేసే మ్యాచ్‌ కావడంతో అభిమానులు వివిధ మార్గాల్లో టికెట్లను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు.

టీ20 టికెట్లు బ్లాక్‌

రూ.1500 @ రూ.9 వేలు


సికింద్రాబాద్‌/ బోయినపల్లి, సెప్టెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం జరిగే 3వ టీ20 మ్యాచ్‌ సిరీ్‌సను డిసైడ్‌ చేసే మ్యాచ్‌ కావడంతో అభిమానులు వివిధ మార్గాల్లో టికెట్లను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఈ మ్యాచ్‌ను మైదానంలో తిలకించడానికి ఉవ్విళ్లూరుతున్న అభిమానుల బలహీనతను కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. రూ.1500 టికెట్‌ను బ్లాక్‌లో కొందరు రూ.9వేలకు పైగా విక్రయించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, అనుమానాస్పదంగా కనిపిస్తున్న కొందరు వ్యక్తులు టికెట్లు అమ్ముతుండడంతో వారికి అసలు టికెట్లు ఎలా వచ్చాయనే విషయమై శనివారం జింఖానా మైదానం పరిసరాల్లో చర్చనీయాంశంగా మారింది. 


కౌంటర్ల వద్ద ప్రత్యేక క్యూ

మ్యాచ్‌కోసం ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని టికెట్ల కోసం జింఖానా మైదానానికి వస్తున్న వారి కోసం క్యూలను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పికెటింగ్‌లను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌ కోడ్‌, ఆధార్‌ కార్డును పరిశీలించిన తర్వాతే అభిమానులను పోలీసులు లోపలికి అనుమతించారు. 


బ్లాక్‌లో విక్రయిస్తున్న నలుగురి అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): టీ-20 క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న నలుగురిని ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు, ఎల్‌బీనగర్‌ పోలీసులు వేర్వేరుగా అరెస్ట్‌ చేశారు. బోడుప్పల్‌కు చెందిన మచ్చేంద్ర, ఉప్పల్‌కు చెందిన భరత్‌రెడ్డి చైతన్యపురి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి రూ.1500 మ్యాచ్‌ టికెట్లను రూ.6వేలకు విక్రయిస్తుండగా సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు వారిని పట్టుకున్నారు. రెండు టికెట్లతోపాటు రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. మరో ఘటనలో నాగోల్‌ వంతెన వద్ద శనివారం రాత్రి వెయ్యి రూపాయల టికెట్‌ను బ్లాకులో రూ.5వేలకు విక్రయిస్తున్నట్లు ఎల్‌బీనగర్‌ పోలీసులకు సమాచారం అందింది. వంతెన వద్ద నిఘా పెట్టి నిందితులైన ఉప్పల్‌, రామంతాపూర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు వడ్డేపల్లి రాహుల్‌(25)ను, ఎస్‌.గోపీ(26)లను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 4 వెయ్యి రూపాయల టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.


నేడు అర్ధరాత్రి వరకు బస్సులు, మెట్రో రైళ్లు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఆదివారం జరిగే క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు వచ్చే క్రీడాభిమానుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, మెట్రో రైళ్లు నడవనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి అర్ధరాత్రి వరకు బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ యాదగిరి తెలిపారు. బస్సుల సమాచారం కోసం 9959226140, 7893088433 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలన్నారు. 

మరోవైపు మ్యాచ్‌ను పురస్కరించుకుని నగరంలో ఆదివారం అర్ధరాత్రి 1.00 గంట వరకు మెట్రో రైళ్లను నడుపనున్నట్లు అధికారులు తెలిపారు.

Read more