ఐటీ, ఈడీ ఆఫీసులపై నిఘా

ABN , First Publish Date - 2022-11-30T02:57:49+05:30 IST

ఆదాయ పన్ను శాఖ(ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కార్యాలయాలపై తెలంగాణ సర్కారు ఓ కన్నేసింది.

ఐటీ, ఈడీ ఆఫీసులపై నిఘా

24 గంటలూ కన్నేసిన తెలంగాణ ప్రభుత్వం

కార్యాలయాల ముందు నిఘా విభాగం కావలి

ఆఫీసుల వద్ద హడావుడి కనిపిస్తే అప్రమత్తం

తక్షణమే ఉన్నతాధికారులకు తెలిసేలా ఏర్పాట్లు

కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపైనా నిఘా నేత్రం

వరుస సోదాల నేపథ్యంలో సర్కారు జాగ్రత్తలు

హైదరాబాద్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ఆదాయ పన్ను శాఖ(ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కార్యాలయాలపై తెలంగాణ సర్కారు ఓ కన్నేసింది. రేయింబవళ్లూ ఆయా ఆఫీసుల ముందు నిఘా విభాగం అధికారులను ఉంచి, అనుక్షణం అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకుంటోంది. ఇటీవల రాష్ట్రంలో ఐటీ, ఈడీ వరుస దాడుల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. గడిచిన కొద్ది రోజులుగా రాష్ట్రంలో వరుసగా ఎక్కడో ఒక చోట ఏదో ఒక కేసులో ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయి.

నేతల ఇళ్లు, కార్యాలయాలు, సన్నిహితులు, బంధువుల నివాసాలు.. వేర్వేరు ప్రాంతాల్లో ఏక కాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బషీర్‌బాగ్‌లో పక్కపక్కనే ఉన్న ఈడీ, ఐటీ కార్యాలయాల వద్ద జరుగుతున్న పరిణామాలపై 24 గంటలూ రాష్ట్ర నిఘా విభాగం దృష్టి సారిస్తోంది. ప్రధానంగా అర్ధరాత్రి దాటిన తర్వాత, తెల్లవారుఝామున ఆయా కార్యాలయాల ముందు ఏమాత్రం హడావిడి కనిపించినా, తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారం అందేలా ఏర్పాట్లు చేశారు. క్యాసినో కేసులో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇద్దరు సోదరులను ఈడీ రెండు రోజులు విచారించింది. ఉమ్మడి రాష్ట్రంలో నమోదైన కేసులో గ్రానైట్‌ అక్రమ రవాణాకు సంబంధించి మంత్రి గంగుల కమలాకర్‌ను టార్గెట్‌గా చేసుకుని ఈడీ రెండు రోజులు కరీంనగర్‌, హైదరాబాద్‌లో దాడులు నిర్వహించింది.

గంగుల నివాసం, కార్యాలయాల్లో లభించిన ఆధారాల మేరకు ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు చెందిన ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేసింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ.. రాష్ట్రంలో అధికార పార్టీ కీలక నేతల సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో వరుస సోదాలు నిర్వహించింది. మంత్రి మల్లారెడ్డి స్కూళ్లు, కాలేజీలు, ఇల్లు, కార్యాలయాలు, బంధువుల నివాసాల్లో నాలుగు రోజుల క్రితం ఐటీ తనిఖీలు చేసింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి అధికార పార్టీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని ఈడీ విచారించింది. క్యాసినో కేసులో పలువురు అధికార పార్టీ నేతలకు ఈడీ నోటీసులు అందాయి.

ఎక్కడ సోదాలు చేసినా వందలాది మంది అధికారులు, కేంద్ర బలగాలతో రంగంలోకి దిగుతున్నారు. తెల్లవారుఝామున దాడులు మొదలుపెట్టి కొన్ని చోట్ల మర్నాటి వరకు కొనసాగిస్తున్నారు. తర్వాత బషీర్‌బాగ్‌లోని ఐటీ, ఈడీ కార్యాలయాలకు చేరుకుని అంతా చక్కదిద్దుకుంటున్నారు. తెలంగాణలోకి సీబీఐ ప్రవేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలే లక్ష్యంగా కేంద్ర సంస్థలు వరుస దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలపై ఏసీబీని అస్త్రంగా చేసుకుని ఎదురుదాడి చేసేందుకు రాష్ట్ర సర్కారు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అవినీతి, అక్రమాలను గుర్తించేందుకు రాష్ట్ర నిఘా వ్యవస్థను రంగంలోకి దింపినట్లు సమాచారం.

Updated Date - 2022-11-30T02:57:50+05:30 IST