వార్షిక పద్దుల్లేవ్..

ABN , First Publish Date - 2022-03-16T16:21:03+05:30 IST

రాష్ట్ర బడ్జెట్‌లో వాటర్‌బోర్డుకు రూ.వందల కోట్లు కేటాయిస్తారు. తాగునీటి, మురుగునీటి నిర్వహణ కోసం ఏడాదికి రూ.1500 కోట్ల వరకు ఆదాయ

వార్షిక పద్దుల్లేవ్..

పదేళ్లుగా వాటర్‌బోర్డు, ఐదేళ్లుగా హెచ్‌జీసీఎల్‌ 

ఆదాయ, వ్యయాలపై గోప్యత

రూ.3,482కోట్లకు పూచికత్తునిచ్చిన ప్రభుత్వం

జాప్యాన్ని ఎండగట్టిన కాగ్‌


నగరంతోపాటు ఔటర్‌ రింగ్‌రోడ్డు పరిధిలోని ప్రాంతాలకు తాగునీటిని అందిస్తున్న వాటర్‌బోర్డు వార్షిక పద్దులను ప్రభుత్వానికి అందజేయడం లేదు. ఏడాది, రెండేళ్లుగా కాదు. ఏకంగా పదేళ్లుగా వార్షిక పద్దుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయకుండా గోప్యంగా వ్యవహరిస్తోంది. ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన వాటర్‌బోర్డుకు నగరంలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు, మురుగునీటి సమస్యల నివారణా చర్యలు చేపట్టే క్రమంలో పెద్దఎత్తున రుణాలు అవసరమవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వమే ముందు నిలిచి రూ.6,457 కోట్ల రుణాలను సమకూర్చింది. అందులో రూ.3,482కోట్ల రుణాలకు పూచీకత్తు ఇచ్చింది. అయితే, వార్షిక పద్దులను అందజేయని వాటర్‌బోర్డుకు ఏ విధంగా పూచికత్తు ఇస్తారని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది.


హైదరాబాద్‌ సిటీ, మార్చి15 (ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర బడ్జెట్‌లో వాటర్‌బోర్డుకు రూ.వందల కోట్లు కేటాయిస్తారు. తాగునీటి, మురుగునీటి నిర్వహణ కోసం ఏడాదికి రూ.1500 కోట్ల వరకు ఆదాయ, వ్యయాలు అవుతుంటాయి. బోర్డుకు సంబంధించిన ఆదాయ, వ్యయాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడంతోపాటు ఏటా ఆర్థిక సంవత్సరం చివరలో బడ్జెట్‌ రూపకల్పన చేస్తారు. ప్రభుత్వ ఆమోదం తీసుకుంటారు. కానీ, వార్షిక నివేదికలను ఎప్పటికప్పుడు వాటర్‌బోర్డు అందించ లేదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇదే ధోరణిని అవలంభిస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో వాటర్‌బోర్డుకు రూ.825కోట్ల రుణాలను, 2020 మార్చి వరకు మొత్తంగా రూ.6,457కోట్ల రుణాలను ప్రభుత్వం అందజేసింది. అందులో రూ.3,482కోట్ల రుణాలకు ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చింది. అయితే 2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి పదేళ్లుగా వార్షిక పద్దులను ప్రభుత్వానికి అందజేయకపోవడంపై కాగ్‌తోపాటు సామాన్యులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


జవాబుదారీతనమేదీ?

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం లాభదాయకత, నిర్వహణ బలం, ఆర్థిక నిష్పత్తులు వంటి అంశాల ఆధారంగా రుణం తీసుకునే సంస్థల ఆర్థిక పనితీరును ప్రభుత్వం విశ్లేషించాలి. ఇందుకోసం ఎప్పటికప్పుడు సంబంధిత సంస్థలు ఆర్థిక సంవత్సరపు ఆదాయ, వ్యయాల వివరాలను అందజేయాలి. అయితే, వార్షిక పద్దులను అందజేయడంలో జాప్యం వల్ల జవాబుదారీతనం పలుచబడుతుంది. పద్దుల తయారీలోని అసలు ప్రయోజనాన్ని ఈ జాప్యం దెబ్బతీస్తుంది. రుణాలు, పూచీకత్తులు, గ్రాంట్లను అందుకుంటున్న స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు వార్షిక పద్దులను తయారు చేసి సకాలంలో అందజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఈ ప్రక్రియ ద్వారా ఆర్థికపరమైన తప్పులను, అక్రమాలు జరగకుండా అరికట్టవచ్చని కాగ్‌ పేర్కొంది.


అదే దారిలో హెచ్‌జీసీఎల్‌

వార్షిక పద్దులివ్వని దారిలో హెచ్‌జీసీఎల్‌ కూడా నడుస్తోంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం చేపట్టిన హైదరాబాద్‌ గ్రోథ్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) ఐదేళ్లుగా వార్షిక పద్దులను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం లేదు. గ్రేటర్‌ హైదరాబాద్‌కు మణిహారంగా మెరుగైన రవాణా సౌకర్యం కోసం వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టు ఫలితాలు శాసనసభకు తెలియడం లేదని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది. దీని ద్వారా ఆడిట్‌ పరిశీలన కూడా దారితప్పుతుందని వివరించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెచ్‌జీసీఎల్‌ కంపెనీ ఆధ్వర్యంలోనే ఔటర్‌ రింగ్‌రోడ్డును నిర్మాణం చేశారు. అయితే ఔటర్‌ 158 కి.మీ. మేర పూర్తయి మెరుగైన ఆదాయం వచ్చినప్పటినుంచి ఆదాయ, వ్యయాల పద్దులను హెచ్‌జీసీఎల్‌ ప్రభుత్వానికి అందజేయడం లేదు. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి వార్షిక పద్దులను అందజేయాల్సిన 40 కంపెనీలలో ఒకటిగా హెచ్‌జీసీఎల్‌ కూడా ఉన్నట్లు కాగ్‌ నివేదికలో పేర్కొంది.


మెట్రోకు సాయంపై పెదవి విరుపు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మహానగరంలో మెట్రో రైలు నిర్వహణపై కంప్ర్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) పెదవి విరిచింది. నగరవాసులకు ట్రాఫిక్‌ రహితమైన ప్రయాణాన్ని అందిస్తూ లాభాల బాటలో పయనించాల్సిన సంస్థ రోజురోజుకు నష్టాలతో కూరుకుపోవడాన్ని ఆక్షేపించింది. ప్రభుత్వ పరంగా సాయం అందిస్తున్నప్పటికీ నికర లాభాలు రాకపోవడంపై నిట్టూర్చింది.  2020లో కొవిడ్‌ ప్రారంభమైనప్పటి నుంచి మెట్రో నష్టాల ఊబిలో కూరుకుపోతూ వస్తోంది. ప్రస్తుతం రోజుకు రూ.80 లక్షల నష్టం వస్తున్నట్లు ఎల్‌అండ్‌టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా, మెట్రో నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 2019-20ఆర్థిక సంవత్సరంలో రూ.2,278.45 కోట్లు, అదనంగా మరో రూ.95కోట్లు రుణం రూపంలో ఇచ్చినట్లు ‘కాగ్‌’ వివరించింది. ఇంత పెద్దమొత్తంలో సాయం అందిస్తున్నా నష్టాలు ఎందుకు వస్తున్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.169.54 కోట్ల నష్టం రావడమే ఇందుకు నిదర్శమని పేర్కొంది. నికర విలువలు పూర్తిగా కరిగిపోతున్న సంస్థలకు సాయం ఇవ్వడం సరైందని కాదని రిపోర్టులో వెల్లడించింది.

Updated Date - 2022-03-16T16:21:03+05:30 IST