మనీ ఇస్తేనే మెటీరియల్‌..!

ABN , First Publish Date - 2022-10-03T17:51:51+05:30 IST

విద్యుత్‌ స్టోర్లలో సిబ్బంది ఇష్టారాజ్యంగా మారింది. వారు ఇచ్చిందే మెటీరియల్‌ అన్నట్లుగా పరిస్థితి ఉంది. మెటీరియల్‌ కేటాయింపుల్లో

మనీ ఇస్తేనే మెటీరియల్‌..!

విద్యుత్‌ స్టోర్లలో సిబ్బంది చేతివాటం

కండక్టర్ల కొలతలో కోత  

ఇష్టానుసారంగా ట్రాన్స్‌ఫార్మర్ల కేటాయింపులు

హైదరాబాద్‌ సిటీ: విద్యుత్‌ స్టోర్లలో సిబ్బంది ఇష్టారాజ్యంగా మారింది. వారు ఇచ్చిందే మెటీరియల్‌ అన్నట్లుగా పరిస్థితి ఉంది.  మెటీరియల్‌ కేటాయింపుల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కిలోమీటర్‌ కండక్టర్‌ కోసం డీడీ కడితే.. స్టోర్లలో 850 నుంచి 900 మీటర్ల కండక్టర్‌ ఇస్తున్నారు. 6 కిలోమీటర్ల కండక్టర్‌కు డీడీ చెల్లిస్తే ఒక డ్రంబు ఇస్తే సరిపోతుంది. కానీ, అలా ఇవ్వకుండా విడిగా ఇస్తున్నారని, అదేమని ప్రశ్నిస్తే ఇప్పుడు మెటీరియల్‌ లేదు తర్వాత రావాలంటూ స్టోర్ల చుట్టూ తిప్పుకుంటున్నారని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల కొరత పేరుతో సీరియల్‌ నంబర్‌లో కాకుండా డబ్బులు ఇచ్చిన వారికే ట్రాన్స్‌ఫార్మర్లు ముందుగా ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొంతకాలంగా పిన్‌ ఇన్స్‌లేటర్లకు డీడీలు చెల్లించినా తర్వాత ఇస్తామంటూ తిప్పుకుంటున్నారని కొంతమంది కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. 


హైదరాబాద్‌, రంగారెడ్డి స్టోర్లలో కొంతమంది అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నా వారిపై ఇప్పటి వరకు ఎలాంటి విచారణ చేపట్టకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. కొంతమంది ఉన్నతాధికారుల అండతో స్టోర్లలో పనిచేస్తున్న కొందరు అక్రమాలకు పాల్పడుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. శివారులో పెద్దసంఖ్యలో భవన నిర్మాణాలు జరగడంతోపాటు వందల సంఖ్యలో భారీ అపార్ట్‌మెంట్లు, కొత్త పరిశ్రమలు వెలుస్తుండటంతో విద్యుత్‌ మెటీరియల్‌కు భారీ డిమాండ్‌ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది విద్యుత్‌ అధికారులు అధిక మొత్తంలో డబ్బులిచ్చే కాంట్రాక్టర్లకు కావాల్సిన మెటీరియల్‌ను ఇస్తున్నారు. మార్కెట్‌లో ట్రాన్స్‌ఫార్మర్లు, కండక్టర్‌కు నెలకొన్న డిమాండ్‌ను బట్టి స్టోర్లలో కమీషన్లు తీసుకుంటున్నారు. రెండేళ్లుగా రంగారెడ్డి, హైదరాబాద్‌ స్టోర్లకు వచ్చిన, బయటకు పంపించిన మెటీరియల్‌, డిస్కం ఖాతాలో జమచేసిన డీడీల మొత్తం వివరాలపై పూర్తిస్థాయిలో ఆడిట్‌ నిర్వహిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని అంటున్నారు.


ప్రత్యేక నిఘా లేక  పెరుగుతున్న అక్రమాలు 

 అండర్‌గ్రౌండ్‌ కేబుల్‌ పనుల కోసం పిలుస్తున్న టెండర్లు, స్టోర్ల నుంచి సర్కిళ్ల వారీగా డివిజన్‌, సెక్షన్‌ స్థాయిలో కేటాయిస్తున్న మెటీరియల్‌ లెక్కలపై ప్రత్యేక నిఘా లేకపోవడంతో విద్యుత్‌శాఖలో అక్రమాలు పెరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో జరిగిన అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినా పలు అసోసియేషన్ల నేతల ఒత్తిడితో విచారణ వరకు వెల్లడం లేదనే విమర్శలున్నాయి. మొత్తం డబ్బులు డీడీల రూపంలో  చెల్లించినా  స్టోర్ల నుంచి ఏ మెటీరియల్‌ బయటకు తీసుకురావాలన్నా ఎంతో కొంత చెల్లించకతప్పని పరిస్థితులున్నాయి. 

Updated Date - 2022-10-03T17:51:51+05:30 IST