ఇంటర్‌ కాగానే సాఫ్ట్‌వేర్‌ జాబ్‌

ABN , First Publish Date - 2022-12-30T03:36:02+05:30 IST

ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ చదువుతోన్న విద్యార్థులకో శుభవార్త.

ఇంటర్‌ కాగానే సాఫ్ట్‌వేర్‌ జాబ్‌

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకే చాన్స్‌

ఏటా 20 వేల మందికి.. హెచ్‌సీఎల్‌తో ఒప్పందం

ఆర్నెల్ల ఇంటర్న్‌షిప్‌.. నెలకు రూ.10 వేల స్టైపెండ్‌

తర్వాత 2.5లక్షల వార్షిక వేతనం: మంత్రి సబిత

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ చదువుతోన్న విద్యార్థులకో శుభవార్త. ఇంటర్‌ విద్యార్హతతోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకోసం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సంస్థతో ఓ అవగాహన ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు చెందిన 20 వేల మంది విద్యార్థులకు ఏటా ఉద్యోగావకాశం కల్పించనున్నామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మీడియట్‌ బోర్డు ఇన్‌చార్జి కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌తో గురువారం ఆమె సమీక్షించారు. హెచ్‌సీఎల్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం గణితం సబ్జెక్టు కలిగి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరిలో ఓ ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తున్నామని ఆమె వెల్లడించారు.

ఈ పరీక్షలో కనీసం 60 శాతం మార్కుల సాధించిన విద్యార్థులకు హెచ్‌సీఎల్‌ సంస్థ వర్చువల్‌గా ఇంటర్వ్యూ నిర్వహించి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి ఎంపిక చేస్తుందని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఆరు నెలల ఆన్‌లైన్‌లో శిక్షణ తరగుతులు జరుగుతాయన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి హెచ్‌సీఎల్‌ కార్యాలయంలో ఆరు నెలల పాటు ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశమిస్తారని అన్నారు. ఈ ఆరు నెలలు నెలకు రూ.10 వేల చొప్పున స్టైఫండ్‌ కూడా ఇస్తారని తెలిపారు. ఇంటర్న్‌షిప్‌ పూర్తి కాగానే రూ. 2.5 లక్షల వార్షిక వేతనంతో పూర్తి స్థాయి ఉద్యోగ అవకాశం కల్పిస్తారని పేర్కొన్నారు. ఇలా ఎంపికైన విద్యార్థులు విధులు నిర్వహిస్తూనే బిట్స్‌, శాస్త్ర, అమిటి యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ పూర్తి చేేసందుకు అవకాశం కల్పిస్తారని మంత్రి వివరించారు. కాగా తెలంగాణ వైతాళికుల జయంతుల క్యాలెండర్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తేజోమూర్తుల చరిత్రను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో పాఠశాలల్లో ప్రతి రోజు జరిగే అసెంబ్లీలో తెలంగాణ సాహితీమూర్తుల జయంతి, వర్ధంతిని నిర్వహించనున్నామని తెలిపారు.

ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

మార్చి 15వ తేదీ నుంచి జరిగే ఇంటర్‌ వార్షిక పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సబిత అధికారులను ఆదేశించారు. ఇంటర్‌ పరీక్షల నిర్వహణ అంశంపై గురువారం ఆమె సమీక్ష నిర్వహించారు. నామినల్‌ రోల్స్‌ నుంచి పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి వరకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులు పరీక్షలకు సన్నద్థం అయ్యేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలన్నారు. ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్‌ బోర్డు ఇన్‌చార్జి కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T03:36:03+05:30 IST