రోడ్ల మధ్య గోతులు..

ABN , First Publish Date - 2022-12-31T00:32:37+05:30 IST

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలో బోయినపల్లి కీలకమైన ప్రాంతం. రెండు జాతీయ రహదారులకు సెంట్రల్‌ పాయింట్‌.

రోడ్ల మధ్య గోతులు..

నాసిరకం పనులతో ప్రజాధనం వృథా

అధికారుల పర్యవేక్షణ లోపం

ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు

బోయినపల్లి, డిసెంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలో బోయినపల్లి కీలకమైన ప్రాంతం. రెండు జాతీయ రహదారులకు సెంట్రల్‌ పాయింట్‌. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న బోయినపల్లి పరిధిలోని బాపూజీనగర్‌లో ప్రధాన రహదారుల నిర్మాణంలో నాణ్యతా లోపం కారణంగా పెద్దపెద్ద గోతులు ఏర్పడుతున్నాయి. దీంతో కంటోన్మెంట్‌ ప్రాంత వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇంజనీరింగ్‌ విభాగం పర్యవేక్షణ లోపం, నాసిరకం పనుల కారణంగా 8 నెలల క్రితం రూ.25 లక్షలతో నిర్మించిన రోడ్లు మూనాళ్లకే గుంతలు పడుతున్నాయి. రెండు రోజుల క్రితం బాపూజీనగర్‌ నుంచి డైమండ్‌ పాయింట్‌, ప్యారడైజ్‌, సికింద్రాబాద్‌ వైపునకు, కొంపల్లి, మేడ్చల్‌ వైపునకు వెళ్లే ప్రధాన రహదారిపైన గొయ్యి పడింది. ఇది గమనించిన స్థానికులు బోర్డు అధికారులకు సమాచారం అందించినా వారు పట్టించుకోవడం లేదు. రెండు రోజులుగా భారీ వాహనాల రాకపోకలతో చిన్న గొయ్యి కాస్తా పెద్దదిగా మారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది.

నాయకులు వస్తున్నారు.. పోతున్నారు

బోయినపల్లి బాపూజీనగర్‌ రోడ్డు పైన ప్రమాదకరంగా ఏర్పడిన గుంతను పరిశీలించేందుకు రెండు రోజులుగా స్థానిక నాయకులు, బోర్డు మాజీ సభ్యులు, మాజీ ఉపాధ్యక్షులు, వివిధ పార్టీల నేతలు వస్తున్నారు.. చూస్తున్నారు వెళ్తున్నారు. కానీ గొయ్యిని పూడ్చడానికి ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. శుక్రవారం బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్‌, జక్కుల మహేశ్వర్‌రెడ్డి, ఆరోవార్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్‌ ఈ ప్రాంతాన్ని పరిశీలించి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

అధికారుల ఇష్టారాజ్యం

కంటోన్మెంట్‌ బోర్డు పాలకమండలి రద్దు కావడంతో అధికారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతోంది. పాలకమండలి బోర్డు సభ్యులు లేకపోవడంతో కాంట్రాక్టర్లు పనుల్లో నాణ్యత పాటించడం లేదని, దీంతో అభివృద్ధి పనులు మూనాళ్లకే దెబ్బతింటున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. బాపూజీనగర్‌ ప్రధాన రహదారిపై రెండు, మూడు సార్లు పెద్దగొయ్యి ఏర్పడింది. ఈ దారిగుండానే రామన్నకుంటలోని వర్షపు, మురుగునీటిని మళ్లించేందుకు భారీ పైపులైన్‌ను ఏర్పాటు చేశారు. మూడున్నర కోట్లతో రామన్నకుంట నుంచి బాపూజీనగర్‌ చౌరస్తా మీదుగా ఫిలిప్స్‌ గోడౌన్‌ వద్ద ఉన్న ఓపెన్‌ నాలాలో మురుగునీటిని కలిపేందుకు పలు మలుపులు తిప్పుతూ ఏర్పాటు చేసిన పైపులైన్‌ వల్లనే పలుమార్లు రోడ్డుపై గుంతలు పడుతున్నట్టు ప్రజలు విమర్శిస్తున్నారు.

అధికారులు పట్టించుకోలేదు

రోడ్డుపైన గుంత పడింది.. మరింత పెద్దదిగా మారుతోంది. గుంత కారణంగా వాహనదారులు ప్రమాదాల బారిన పడొచ్చు. ఈ విషయాన్ని బోర్డు అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోకపోవడం బాధాకరం. ప్రమాదాలు సంభవిస్తేనే పట్టించుకుంటారా..

- రమణి, బోయినపల్లి

అధికారుల తీరు మారాలి

కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో పేదలు ఇళ్లు కట్టుకుంటున్నారంటే అధికారులు నానా రూల్స్‌ చెబుతారు. నిర్మాణాలను కూల్చివేస్తారు. కానీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, నాణ్యత పాటించకపోవడం వల్ల సమస్యలు ఏర్పడినా, ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడం దారుణం

- అనిల్‌రెడ్డి, బోయినపల్లి

Updated Date - 2022-12-31T00:32:37+05:30 IST

Read more