Sharmila: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై స్పందించిన వైఎస్ షర్మిల

ABN , First Publish Date - 2022-10-04T21:55:48+05:30 IST

ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అవినీతి గురించి మాట్లాడింది వాస్తవమేనని షర్మిల అన్నారు.

Sharmila: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై స్పందించిన వైఎస్ షర్మిల

మెదక్ జిల్లా (Medak Dist.): సంగారెడ్డిలో షర్మిల (Sharmila) పాదయాత్ర సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎస్టీ (ST), ఎస్సీ అట్రాసిటీ (SC Atrocity) కేసు నమోదు చేయాలని టీఆర్ఎస్ నేతలు (TRS Leaders) పిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన వైఎస్ షర్మిల మాట్లాడుతూ ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ (Kranti Kiran) అవినీతి గురించి మాట్లాడింది వాస్తవమేనన్నారు. ఈ ఎమ్మెల్యే, ఆయన తమ్ముళ్లు కలిసి కబ్జాలు చేస్తున్నారని, అవినీతి పరులు అని మాట్లాడానన్నారు. ఎమ్మెల్యే తండ్రి స్వయంగా చెప్పిన మాటలనే ప్రస్తావించానన్నారు. దళిత ఎమ్మెల్యే అన్యాయం చేస్తే మాట్లాడకూడదని.. రాజ్యాంగంలో రాసి ఉందా? అని ప్రశ్నించారు. అవినీతి చేస్తే తప్పు లేదు కానీ..  ప్రశ్నిస్తే కేసు పెడతారా? అంటూ మండిపడ్డారు.

 

మరియమ్మను లాకప్‌లో కొట్టి చంపేస్తే ఈ ఎమ్మెల్యే పోలీసుల మీద కేసు పెట్టారా? అని షర్మిల ప్రశ్నించారు. దళిత ముఖ్యమంత్రి అని మాట తప్పిన కేసీఅర్ మీద కేసు పెట్టే దమ్ము ఉందా? అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. అవినీతి ఎత్తి చూపిస్తే తనపై కేసు పెట్టారు. మరి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు వైఎస్సార్ అంబేడ్కర్ పేరు పెట్టారని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఅర్ ఆ ప్రాజెక్ట్‌కు అంబేడ్కర్ పేరు తొలగించారని.. ఆయనపై కేసు పెట్టే ధైర్యం ఉందా? అని నిలదీశారు. తనపై పెట్టిన కేసులకు షర్మిల భయపడేది లేదన్నారు. ఇక్కడ ఉన్నది వైఎస్సార్ బిడ్డ.. పులి బిడ్డని అన్నారు. జోగిపేట గడ్డ మీద డిబేట్ పెడితే అవినీతిని  నిరూపిస్తామని షర్మిల సవాల్ చేశారు.

Updated Date - 2022-10-04T21:55:48+05:30 IST