వణికిస్తోంది
ABN , First Publish Date - 2022-12-13T00:42:25+05:30 IST
నగరంలో ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గగా, తాజాగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా పడిపోతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు
పెరిగిన చలి
హైదరాబాద్ సిటీ, డిసెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): నగరంలో ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గగా, తాజాగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా పడిపోతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజుల క్రితం వరకు రాత్రిపూట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు కావడంతో చలి పెరిగింది. తాజాగా పగటి పూట కూడా ఉష్ణోగ్రత తక్కువగా నమోదవుతుండడంతో చలి తీవ్రత పెరిగింది. ఏపీలో కొనసాగుతున్న మాండౌస్ తుఫాను నేపథ్యంలో గ్రేటర్‌లో శనివారం సాయంత్రం నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి బలంగా వీస్తున్న శీతలగాలులతో చలి ఒక్కసారిగా పెరిగింది. ఇదే సమయంలో తుఫాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు, మోస్తరుగా వర్షం కురుస్తుండడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు వాతావరణం చల్లగా మారగా, రాత్రి 10 దాటిన తర్వాత కొన్ని చోట్ల మోస్తరు వర్షం కురిసింది. సోమవారం సైతం చల్లని వాతావరణం ఉండగా.. సాయంత్రం చినుకులు పడ్డాయి. సికింద్రాబాద్, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, టోలీచౌకీ, మెహిదీపట్నం, తదితర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. సోమవారం నగరంలో సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 26 డిగ్రీలకు మూడు డిగ్రీలు తగ్గింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నాయి. రాగల రెండు రోజులపాటు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు.
Read more