తగ్గిన ప్రసూతి మరణాలు

ABN , First Publish Date - 2022-11-30T03:23:45+05:30 IST

రాష్ట్రంలో ప్రసూతి మరణాల నిష్పత్తి (మెటర్నల్‌ మొర్టాలిటీ రేషియో-ఎంఎంఆర్‌) క్రమేపీ తగ్గుతూ వస్తోంది. ప్రసూతి మరణాల సంఖ్య 56 నుంచి 43కు తగ్గింది.

తగ్గిన ప్రసూతి మరణాలు

అతి తక్కువ ఎంఎంఆర్‌లో దేశంలోనే మూడో స్థానం ఎస్‌ఆర్‌ఎస్‌ బులిటిన్‌ 2018-20ను విడుదల చేసిన కేంద్రం

హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంఽధ్రజ్యోతి) : రాష్ట్రంలో ప్రసూతి మరణాల నిష్పత్తి (మెటర్నల్‌ మొర్టాలిటీ రేషియో-ఎంఎంఆర్‌) క్రమేపీ తగ్గుతూ వస్తోంది. ప్రసూతి మరణాల సంఖ్య 56 నుంచి 43కు తగ్గింది. అతి తక్కువ ఎంఎంఆర్‌లో దేశంలోనే రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో కేరళ (19), రెండో స్థానంలో మహారాష్ట్ర (33) నిలిచాయి. ఈ వివరాలను కేంద్ర హోం ఎఫైర్స్‌ మంత్రిత్వశాఖ జనరల్‌ సెన్సెస్‌ కమిషనర్‌ తాజాగా ఎస్‌ఆర్‌ఎస్‌ బులిటిన్‌ 2018-20ను విడుదల చేసింది. ఎంఎంఆర్‌ను ప్రతి లక్ష మంది గర్భిణుల్లో ప్రసవ సమయంలో ఎంతమంది మంది మరణిస్తున్నారనే గణాంకాల ఆధారంగా లెక్కిస్తారు. తెలంగాణలో మాత, శిశు సంరక్షణలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఎంఎంఆర్‌ గణనీయంగా తగ్గటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

తాజాగా విడుదల చేసిన ఎస్‌ఆర్‌ఎస్‌ బులిటెన్‌ ప్రకారం ఎంఎంఆర్‌ 43కు తగ్గింది. 2017-19లో ఇది 56గా ఉంది. వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల ఎంఎంఆర్‌ ఏకంగా 13 పాయింట్లు తగ్గిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడే నాటికి ఎంఎంఆర్‌ 92 ఉండగా, ప్రస్తుతం అది 43కు తగ్గింది. ఈ ఎనిమిదేళ్లలో ఏకంగా 49 పాయింట్లు తగ్గింది. ఇక ఎంఎంఆర్‌లో జాతీయ సగటు 97గా నమోదైంది. అంటే తెలంగాణ కన్నా రెట్టింపు. తాజా ఎస్‌ఆర్‌ఎస్‌ బులిటెన్‌లో కొన్ని రాష్ట్రాల ఎంఎంఆర్‌ ఏమాత్రం తగ్గకపోగా పెరిగింది. ఈ విషయంలో హరియాణ అగ్రస్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో గతంలో 96 ఎంఎంఆర్‌ ఉండగా ప్రస్తుతం అది 110కి పెరిగింది. ఆ జాబితాలో మధ్యప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచింది. అక్కడ 163 నుంచి 173కు పెరిగింది. ఇక ఉత్తరాఖండ్‌లో రెండు పాయింట్ల పెరగ్గా, ఉత్తరప్రదేశ్‌లో ఏ మాత్రం మార్పు రాలేదు. దేశంలోనే అత్యంత ఎక్కువగా ప్రసూతి మరణాలు అసోంలో సంభవిస్తున్నాయి. అక్కడ ఎంఎంఆర్‌ 195గా నమోదైనట్లు తాజా ఎస్‌ఆర్‌ఎస్‌ బులిటెన్‌లో వెల్లడైంది.

ఫలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలు

మాత, శిశు సంరక్షణలో భాగంగా సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన కేసీఆర్‌ కిట్లు పథకం విప్లవాత్మకమైన మార్పు తెచ్చిందనే చెప్పాలి. గర్భిణులకు ప్రతి నెలా పరీక్షలు చేయించడం, అమ్మఒడి వాహనాలతో వారికి నాణ్యమైన సేవలు అన్ని దశల్లో అందుతున్నాయి. రక్తహీనతను గుర్తించి సప్లిమెంటరీ ట్యాబ్లెట్లను ఉచితంగా అందిస్తున్నారు. హైరిస్క్‌ ఉన్న వారిని సకాలంలో గుర్తిస్తుండడంతో ప్రసూతి మరణాలను అరికట్టడంలో వైద్యశాఖ మంచి ఫలితాలను సాధిస్తోంది.

‘డబుల్‌ ఇంజిన్‌’ రాష్ట్రాలు వెనకబడ్డాయి : మంత్రి హరీశ్‌

ఎంఎంఆర్‌ విషయంలో దేశంలోనే మూడోస్థానంలో నిలవడంపై వైద్యమంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్యరోగ్య శాఖ కృషిని అభినందించారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనతో రాష్ట్రంలో అమలు చేస్తున్న మాత, శిశు సంరక్షణ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయన్నారు. ప్రసూతి మరణాలు తగ్గించడంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయన్నారు. దీంతో సంతృప్తి చెందకుండా, ప్రసూతి మరణాలు తగ్గించడంలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణను మొదటి స్థానానికి చేర్చాలని ఆకాంక్షించారు. అలాగే ట్వీట్టర్‌లో వరుసగా రెండు ట్వీట్స్‌ చేశారు. ‘‘తెలంగాణ అమలు చేస్తున్నది దేశం అనుకరిస్తున్నది. 2014నుంచి రాష్ట్రంలో ప్రసూతి మరణాలు గణనీయంగా తగ్గాయి. ఈ 8 ఏళ్లలో దేశంలో 25 పాయింట్ల మేరకు ఎంఎంఆర్‌ తగ్గితే రాష్ట్రంలో 49 పాయింట్లు తగ్గింది. ప్రస్తుతం మూడోస్థానంలో నిలిచింది. బీజేపీ పాలిత డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రాష్ట్రాలు ఈ విషయంలో వెనుకబడ్డాయి’ అని ట్వీట్‌ చేశారు.

Updated Date - 2022-11-30T03:26:13+05:30 IST