ఆకాశహర్మ్యాలు

ABN , First Publish Date - 2022-10-01T17:29:15+05:30 IST

మహానగరంలో నిర్మాణ రంగం రూటు మారింది. పశ్చిమానే కేంద్రీకృతమైన భారీ భవన నిర్మాణ ప్రాజెక్టులు తూర్పునకూ విస్తరిస్తున్నాయి

ఆకాశహర్మ్యాలు

తూర్పున రెండు ప్రాజెక్టులు

రూటు మార్చిన నిర్మాణ రంగం  

ఒక్కొక్కటి 30 అంతస్తుల భవనాలు   

ఆసక్తి చూపుతోన్న రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు

ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో కసరత్తు

ఐటీ కారిడార్‌తో పోలిస్తే ధరలూ తక్కువే


హైదరాబాద్‌ సిటీ: మహానగరంలో నిర్మాణ రంగం రూటు మారింది. పశ్చిమానే కేంద్రీకృతమైన భారీ భవన నిర్మాణ ప్రాజెక్టులు తూర్పునకూ విస్తరిస్తున్నాయి. ఎల్‌బీనగర్‌, హయత్‌నగర్‌, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో 20, 30 అంతస్తులతో కూడిన ఆకాశ హర్మ్యాల నిర్మాణం మొదలయింది. రెండు ప్రాంతాల్లో 30 అంతస్తుల భవన నిర్మాణాల కోసం దరఖాస్తులు వచ్చాయని జీహెచ్‌ఎంసీ పట్టణ ప్రణాళికా విభాగం వర్గాలు చెబుతున్నాయి. 18, 20 అంతస్తుల భవనాల నిర్మాణం పలు ప్రాంతాల్లో మొదలు కాగా.. మరికొన్ని అనుమతుల జారీ పరిశీలన దశలో ఉన్నాయి. 


నగర వ్యాప్తంగా భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తోన్నా.. బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు మాత్రం ఇప్పటి వరకు పశ్చిమానే ఎక్కువగా జరుగుతున్నాయి. ఐటీ, ఇతరత్రా సంస్థలు ఉన్న మాదాపూర్‌, రాయదుర్గం, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ తదితర ప్రాంతాల్లో నివాస, నివాసేతర బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు చేపడుతున్నారు. గ్రేటర్‌ పరిధిలో 42 అంతస్తులుగా నిర్మించిన భవనమే ఇప్పటి వరకు ఎత్తయిన నిర్మాణం కాగా.. ఆ భవనమూ పశ్చిమానే ఉంది. ఇదే ప్రాంతంలో 54 అంతస్తుల భవన నిర్మాణ ప్రాజెక్టు అనుమతి కోసం చేసిన దరఖాస్తు జీహెచ్‌ఎంసీ పరిశీలనలో ఉంది. కొంతకాలంగా తూర్పు వైపున బహుళ అంతస్తుల భవన ప్రాజెక్టుల నిర్మాణానికి రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. 


రవాణా సులువు.. ధర తక్కువ

ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌ నుంచి ఐటీ కారిడార్‌, ఇతర ప్రధాన ప్రాంతాలకు గతంతో పోలిస్తే రాకపోకలు సులువయ్యాయి. మెట్రో కారిడార్‌ అందుబాటులోకి రావడం, ఆయా ప్రాంతాల్లో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎ్‌సఆర్‌డీపీ)లో భాగంగా వంతెనలు, అండర్‌పా్‌సలు ప్రారంభమయ్యాయి. దీంతో కొంతమేర ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గాయి. ఫ్లాట్‌ అయినా, ఇండిపెంటెండ్‌ ఇళ్లు అయినా ఐటీ కారిడార్‌లోని ప్రాంతాలతో పోలిస్తే ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌ వైపు తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. ఐటీ కారిడార్‌లో లభించే ఫ్లాట్‌ లేదా ఇండిపెండెంట్‌ ఇళ్ల ధరల కంటే రూ.20లక్షల నుంచి రూ.30లక్షల వరకు తక్కువ ధరలో తూర్పు వైపున మెరుగైన సదుపాయాలు లభించే అవకాశముంది. ఇవన్నీ తూర్పు వైపు నిర్మాణ రంగం వృద్ధి చెందడానికి కారణాలని రియల్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. 


రికార్డు స్థాయి ఆదాయం

మునుపెన్నడూ లేనివిధంగా గ్రేటర్‌లో నిర్మాణ రంగం జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతోంది. పూర్వ ఎంసీహెచ్‌, ప్రస్తుత జీహెచ్‌ఎంసీ చరిత్రలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.1154 కోట్ల ఆదాయం రాగా, ఆ రికార్డును తిరగరాస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఆగస్టు చివరి నాటికి) 5,038 అనుమతుల ద్వారా రూ.650 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఆర్థిక సంవత్సరం ఆగస్టు నాటికి వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఇది దాదాపు రూ.200 కోట్లు అధికమని చీఫ్‌ సిటీ ప్లానర్‌ ఎస్‌. దేవేందర్‌రెడ్డి తెలిపారు. ఈసారి రూ.1300 కోట్లకుపైగా ఆదాయం రావొచ్చని అంచనా వేస్తున్నారు. 


20 నుంచి 30 అంతస్తులు

ఎల్‌బీనగర్‌, హయత్‌నగర్‌ వైపు రెండుచోట్ల 30 అంతస్తుల భవన నిర్మాణ ప్రాజెక్టుల నిర్మాణానికి కసరత్తు మొదలైంది. విజయవాడ జాతీయ రహదారి దగ్గరలో హయత్‌నగర్‌ వైపు ఓ నిర్మాణ సంస్థ, ఎల్‌బీనగర్‌ చౌరస్తా సమీపంలో మరో సంస్థ 30 అంతస్తుల భవన నిర్మాణ అనుమతుల కోసం జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేశాయి. నివాస కేటగిరీలో వచ్చిన రెండు దరఖాస్తులను కేంద్ర కార్యాలయ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదే జోన్‌లో 18-20 అంతస్తుల భవనాలూ నిర్మాణంలో ఉన్నాయి. పలు ప్రాంతాల్లో ప్రతిపాదించిన ఆరు నిర్మాణాలకు అనుమతి ఇవ్వగా.. మరో నాలుగు ప్రాంతాల్లో నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తులు వచ్చాయని ఉన్నతాధికారొకరు తెలిపారు. ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో, ఉప్పల్‌ భగాయత్‌, కర్మన్‌ఘాట్‌, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి రియల్‌ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. 

Read more