రంగారెడ్డి డీసీసీ పీఠం ఎవరికో?

ABN , First Publish Date - 2022-12-13T00:15:02+05:30 IST

రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడి పదవిపై ఉత్కంఠ నెలకొంది. అన్ని జిల్లాలకు కాంగ్రెస్‌ అధ్యక్షులను నియమించిన అధిష్ఠానం ఈ స్థానంలో ఎవరినీ భర్తీ చేయలేదు.

రంగారెడ్డి డీసీసీ పీఠం ఎవరికో?

  • రేసులో పలువురు

ఎల్‌బీనగర్‌, డిసెంబర్‌ 12(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడి పదవిపై ఉత్కంఠ నెలకొంది. అన్ని జిల్లాలకు కాంగ్రెస్‌ అధ్యక్షులను నియమించిన అధిష్ఠానం ఈ స్థానంలో ఎవరినీ భర్తీ చేయలేదు. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డిని పీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో ఈ పీఠం ఖాళీ అయ్యింది. డీసీసీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని నియమించనున్నారన్న సమాచారంతో ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్న వారు పక్కకు తప్పుకున్నారు. ఆయనను పీసీసీ ఉపాధ్యక్షుడిగా నియమించడంతో ఇప్పుడు ఆ నాయకులంతా మళ్లీ తెరపైకి వస్తున్నారు. ఈ క్రమంలో మల్‌రెడ్డి రంగారెడ్డి సోదరుడు మల్‌రెడ్ది రాంరెడ్డిని నియమించనున్నారని ప్రచారం జరిగింది. దీంతో పలువురు నాయకులు అధిష్ఠానం వద్దకు వెళ్లి అధ్యక్ష స్థానం తమకే ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతో రంగారెడ్డి అధ్యక్ష స్థానం పెండింగ్‌లో పడినట్లు తెలుస్తోంది.

అందరూ తూర్పు వారే..

బీఆర్‌ఎస్‌, బీజేపీ, బీఎస్పీ వంటి ప్రధాన పార్టీల రంగారెడ్డి జిల్లా కమిటీల అధ్యక్షులుగా తూర్పు వైపు వారే ఉండటంతో కాంగ్రెస్‌ పార్టీ కూడా తూర్పు వారినే అధ్యక్షులుగా నియమిస్తుందన్న ఆశతో నేతలు ఉన్నారు. మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన దేప భాస్కర్‌రెడ్డి, ఎల్‌బీనగర్‌ నియోజకవర్గానికి చెందిన మల్‌రెడ్డి రాంరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇబ్రహీంపట్నంకు చెందిన శేఖర్‌గౌడ్‌, ఎల్‌బీనగర్‌కు చెందిన జక్కిడి ప్రభాకర్‌రెడ్డి కూడా తమ తమ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎల్‌బీనగర్‌, మహేశ్వరం నియోజకవర్గాలు కాంగ్రె్‌సకు కంచుకోటగా పార్టీ అధిష్ఠానం భావిస్తుంది. మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించి తర్వాత అప్పటి టీఆర్‌ఎ్‌స(ఇప్పుడు బీఆర్‌ఎ్‌స)లో చేరారు. ఎల్‌బీనగర్‌ నుంచి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచి తర్వాత అప్పటి టీఆర్‌ఎ్‌స(ఇప్పుడు బీఆర్‌ఎ్‌స)లో చేరారు. ఈ నియోజకవర్గాలు కాంగ్రె్‌సకు పట్టు ఉన్నవి కావడంతోనే వారిలో ఒకరికి మంత్రి పదవి ఇచ్చి మరొకరికి మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవిలో నియమించినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన వారికే డీసీసీ పీఠం అప్పగిస్తారని భావిస్తున్నారు.

Updated Date - 2022-12-13T00:15:08+05:30 IST