రాజగోపాల్‌రెడ్డి ప్రాజెక్టుకు అంతర్రాష్ట్ర అనుమతి అక్కర్లేదు

ABN , First Publish Date - 2022-11-30T02:49:33+05:30 IST

మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉదారతను చూపింది.

రాజగోపాల్‌రెడ్డి ప్రాజెక్టుకు అంతర్రాష్ట్ర అనుమతి అక్కర్లేదు

ఇసుక తవ్వకాలు లేకపోవడం వల్లే..

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఉదారత

ప్రాజెక్టు ప్రతిపాదనకు ఆమోదం.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందా?

ఇప్పటికే ఆ ప్రాంతంలో ప్రాజెక్టుకు గ్రీన్‌కో సన్నద్ధం.. టీఎస్‌-ఐపాస్‌లో దరఖాస్తు

హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉదారతను చూపింది. నిర్మల్‌ జిల్లా నేరడిగొండ/సారంగపూర్‌ మండలాల పరిధిలోని రాణాపూర్‌ గ్రామంలో రాజగోపాల్‌రెడ్డికి చెందిన సిద్ధార్థ ఇన్‌ఫ్రాటెక్‌ నిర్మించతలపెట్టిన 1,200 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు అంతరాష్ట్ర అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మంత్రిత్వశాఖ నిపుణుల మదింపు కమిటీ(ఈఏసీ-రివర్‌ వ్యాలీ అండ్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్ట్స్‌) తీర్మానించింది. గత నెల 11న ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లగా.. టీవోఆర్‌(టర్మ్‌ అండ్‌ రిఫరెన్స్‌)ను జారీచేశారు. టీవోఆర్‌లో మార్పులతో.. నిబంధనలు ఎత్తివేసి ప్రాజెక్టు ప్రతిపాదనలకు అంగీకారం తెలుపుతూ ఈనెల 15వ తేదీన జరిగిన సమావేశంలో కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కమిటీ సమావేశ మినిట్స్‌ను మంగళవారం విడుదల చేశారు. ‘‘ఈ ప్రాజెక్టు కోసం ఎగువ భాగంలో ఒక రిజర్వాయర్‌ను నిర్మిస్తారు.

దిగువ భాగంలో మరో రిజర్వాయర్‌ ఉంటుంది. ఆ తర్వాత నదీప్రవాహ మార్గంలో ప్రాజెక్టు లేదు. అందుకే ఇది రివర్‌ బేసిన్‌ ప్రాజెక్టు కాదు. నదీ ప్రవాహ మార్గంలో ప్రాజెక్టు నిర్మాణం ఉంటే.. అంతర్రాష్ట్ర అనుమతి అవసరం. కానీ, ఈ ప్రాజెక్టు విషయంలో అలాంటి అడ్డంకులు లేవు’’ అని కమిటీ ఆ మినిట్స్‌లో స్పష్టం చేసింది. స్వర్ణ లేదా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ఏకకాలంలో ఈ ప్రాజెక్టు కోసం నీటిని తీసుకుంటారని గర్తుచేసింది. పంప్డ్‌స్టోరేజీ ప్రాజెక్టు కావడంతో ఇసుక, క్వారీ తవ్వకాలు, నీటి ముంపు వంటివి ఉండ వని, ప్రాజెక్టు దిగువన పడే ప్రభావం ఉండకపోవడంతో ఇదివరకు విధించిన నిబంధనను ఎత్తివేశారు. ప్రాజెక్టు వల్ల రిజర్వాయర్‌/రివర్‌ బ్యాంక్‌ ప్రొటెక్షన్‌ పనులు కూడా చేపట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. తెలంగాణలోనే ఈ ప్రాజెక్టు ఉండటం.. స్వర్ణ/శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ఏకకాలంలో నీటిని తీసుకుంటున్నందున నీటి లభ్యతపై తెలంగాణ ప్రభుత్వం అనుమతినిస్తే సరిపోతుందని, ఇతర రాష్ట్రాల అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. అంతర్రాష్ట్ర అనుమతి అవసరం లేనందున.. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర అటవీ శాఖ అనుమతి కీలకం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టుకు అటవీ భూమిని కేటాయిస్తే.. అంతే మొత్తంలో ప్రత్యామ్నాయ భూమిలో అడవిని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 1,240 ఎకరాల అటవీ భూమిని సేకరించడానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తుందా..? అనేది ప్రశ్నార్థకమే..!

ఈ ప్రాజెక్టును రూ.6614.15 కోట్ల అంచనావ్యయంతో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. ఏడాదికి 2,592 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి జరుగుతుంది. రోజుకు 6.23 గంటల పాటు విద్యుత్తును ఉత్పత్తి చేసి.. దాన్ని నిర్మల్‌లోని 400 కేవీ ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌కు సరఫరా చేస్తారు. ఈ ప్రాజెక్టుకు 1,240 ఎకరాల అటవీ భూమితోపాటు.. 265.88 ఎకరాల ప్రభుత్వ భూమి అవసరం ఉంటుంది. అటవీశాఖ అనుమతి లభిస్తే.. 42 నెలల్లో ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. పొరుగు రాష్ట్రంతో ఏపీలో ఇబ్బడిముబ్బడిగా పంప్డ్‌స్టోరేజీ విద్యుత్కేంద్రాలకు అనుమతి ఇవ్వగా.. తెలంగాణలో రాజగోపాల్‌ రెడ్డి కంపెనీ నిర్మించేదే తొలి కేంద్రం కావడం గమనార్హం! ఇప్పటికే ములుగులో ఒక పంప్డ్‌ స్టోరేజీ కేంద్రానికి జేఎస్‌డబ్ల్యూ అనుమతి తీసుకున్నప్పటికీ.. దాన్ని మరో ప్రాంతానికి తరలించాలని నిర్ణయించింది.

భూసేకరణలో మెలిక?

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ తరఫున బరిలో దిగిన రాజగోపాల్‌రెడ్డి.. అధికార టీఆర్‌ఎ్‌సకు గట్టి పోటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా.. ఇదే ప్రాంతంలో టీఎ్‌స-ఐపా్‌సలో భాగంగా గ్రీన్‌కో కంపెనీ ఓ ప్రాజెక్టు నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంది. ఆ సంస్థకు అనుమతి ఇస్తే.. ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ప్రశ్నార్థకంగా మారింది.

విద్యుదుత్పత్తి ఇలా..

ఈ ప్రాజెక్టులో భాగంగా కొండ ప్రాంతంలో ఒక రిజర్వాయర్‌, కొండకు దిగువన మరో రిజర్వాయర్‌ను నిర్మిస్తారు. ఒక్కో రిజర్వాయర్‌ సామర్థ్యం 1.095 టీఎంసీలు. లైవ్‌ స్టోరేజీ(జలవిద్యుదుత్పత్తికి వాడే నీటి సామర్థ్యం) 0.678 టీఎంసీలు. దిగువన ఉన్న రిజర్వాయర్‌కు స్వర్ణ ప్రాజెక్టు/శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ఏకకాలంలో 1.095 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోతల ద్వారా పంపింగ్‌ చేస్తారు. ఆ తర్వాత ఈ నీటిని 7.09 గంటల పాటు కొండపైన ఉన్న రిజర్వాయర్‌కు పంపింగ్‌ చేస్తారు. ఆ రిజర్వాయర్‌ నుంచి నీటిని కిందికి వదులుతూ.. మధ్యలో ఉన్న 5 యూనిట్లతో విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. రోజుకు(డిమాండ్‌ ఉన్నప్పుడే) 7.01 మిలియన్‌ యూనిట్ల చొప్పున.. ఏడాదికి 2,592 మిలియన్‌ యూనిట్లను ఉత్పత్తి చేస్తారు. డిమాండ్‌ లేని సమయాల్లో ఓపెన్‌ యాక్సెస్‌ నుంచి చౌకగా లభించే కరెంటును వినియోగించి.. కింద రిజర్వాయర్‌ నుంచి నీటిని కొండపైనుండే రిజర్వాయర్‌కు పంపింగ్‌ చేస్తారు.

Updated Date - 2022-11-30T13:46:10+05:30 IST