మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు సహకరించాలి

ABN , First Publish Date - 2022-07-18T05:59:45+05:30 IST

రైళ్లలో మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే ఐజీ ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్యూరిటీ కమిషనర్‌ రాజారాం అన్నారు.

మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు సహకరించాలి

ఎస్‌సీఆర్‌ ఐజీ ప్రిన్సిపల్‌  చీఫ్‌ సెక్యూరిటీ కమిషనర్‌ రాజారాం

హైదరాబాద్‌ సిటీ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రైళ్లలో మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే ఐజీ ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్యూరిటీ కమిషనర్‌ రాజారాం అన్నారు. మానవ అక్రమ రవాణాను నిరోధించడంపై సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయంలో ఆదివారం దక్షిణ మధ్య రైల్వే రక్షక సిబ్బంది(ఆర్‌పీఎఫ్‌), ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ(ఐజీఎన్‌ఓయూ) రైల్వే సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజారాం మాట్లాడుతూ.. కొందరు తమ స్వార్థం కోసం చిన్నారులను శ్రమ, లైంగిక దోపిడీకి రైల్వే మార్గాలను అక్రమంగా వాడుకుంటున్నారని అన్నారు. రైళ్లలో మానవ అక్రమ రవాణాను అరికట్టి పిల్లలు, ఇతరుల హక్కులను రక్షిస్తూ వారి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ అసిస్టెంట్‌ రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సౌజన్య మాట్లాడుతూ.. సమాజంలో దోపిడీకి గురయ్యే సామాన్యులు రైల్వే ప్లాట్‌ఫారాలపై కూడా కనిపిస్తుంటారని, వారికి అవగాహన కల్పిస్తే మానవహక్కుల రంగంలో న్యాయం చేకూర్చినట్లవుతుందన్నారు. మానవ అక్రమ రవాణాపై క్షేత్రస్థాయిలో పరిశీలించి దాని నివారణ, పునారావాసానికి మార్గాలు చూపించాలని పేర్కొన్నారు. సదస్సులో రైల్వే పోలీస్‌ కమిషనర్లు, అసిస్టెంట్‌ కమిషనర్లు, 150 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-18T05:59:45+05:30 IST