Secunderabad: రైల్వేస్టేషన్‌లో బాలుడి కిడ్నాప్‌

ABN , First Publish Date - 2022-10-01T16:24:46+05:30 IST

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఏడాది బాలుడిని ఓ మహిళ కిడ్నాప్‌ చేసింది. కింద్రాబాద్‌ రైల్వే పోలీసులు, రైల్వే రక్షణ దళం పోలీసులు కేవలం రెండు

Secunderabad: రైల్వేస్టేషన్‌లో బాలుడి కిడ్నాప్‌

రెండు గంటల్లోనే గుర్తించిన రైల్వే పోలీసులు

హైదరాబాద్/సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఏడాది బాలుడిని ఓ మహిళ కిడ్నాప్‌ చేసింది. కింద్రాబాద్‌ రైల్వే పోలీసులు, రైల్వే రక్షణ దళం పోలీసులు కేవలం రెండు గంటల్లో బాలుడి ఆచూకీ కనుగొని తల్లికి అప్పగించారు. సికింద్రాబాద్‌ రైల్వే ఎస్పీ అనురాధ, డీఎస్పీ నర్సయ్య, సీఐ శ్రీను కథనం ప్రకారం కర్ణాటక గుల్బార్గాకు చెందిన హన్మంతు భార్య మార్గమ్మ తన ఏడాది కుమారుడితో కలిసి శుక్రవారం ఉదయం గుంటూరు నుంచి నర్సాపూర్‌ ఎక్స్‌ప్రె్‌సలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. టికెట్‌ కౌంటర్‌ వద్ద ఉండగా కవాడిగూడ తాళ్లబస్తీకి చెందిన సోనీ (30) ఆమెతో మాటలు కలిపింది. మార్గమ్మ కర్ణాటకలోని సేడం వెళ్లాలని చెప్పడంతో తానూ అక్కడికే వెళ్తున్నానని ఆమె దగ్గరే కూర్చుంది. ‘నేను బాబును చూస్తుంటాను.. వెళ్లి టికెట్‌ తెచ్చుకో’ అని సోనీ.. మార్గమ్మను పంపించింది. ఆమె కొడుకును సోనీకి అప్పగించి టికెట్‌ కౌంటర్‌ వద్దకు వెళ్లింది. టికెట్‌ తీసుకొని వచ్చేలోగా బాబుతో పాటు సోనీ కనిపించలేదు. దీంతో టికెట్‌ కౌంటర్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న జీఆర్‌పీ కానిస్టేబుల్‌ రాజశేఖర్‌, ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మాసిరెడ్డిలకు ఫిర్యాదు చేయగా వారు రైల్వే డీఎస్పీ, ఎస్పీ, రైల్వే కంట్రోల్‌రూంలకు సమాచారం ఇచ్చారు.


ఐదు బృందాలుగా..

బాలుడి జాడ తెలుసుకునేందుకు జీఆర్‌పీ, ఆర్పీఎఫ్‌ పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడ్డారు. సీపీ ఫుటేజీలను పరిశీలించారు. గేటు నెంబర్‌ 3 నుంచి ఓ మహిళ బాబును తీసుకెళ్లడం సీసీ ఫుటేజీలో కనిపించింది. గణేష్‌ ఆలయం వద్ద ఉన్న సీసీ ఫుటేజీ ద్వారా ఆమె సోనీగా గుర్తించారు.  గణేష్‌ ఆలయం వద్ద ఆమె ఎక్కిన ఆటో నెంబర్‌ ద్వారా డ్రైవర్‌ వివరాలు సేకరించారు. డ్రైవర్‌కు ఫోన్‌ చేయగా,  ‘అవును సార్‌.. బాబుతో పాటు ఓ మహిళ కవాడిగూడలోని తాళ్లబస్తీలో దిగింది’ అని చెప్పాడు. డ్రైవర్‌ చెప్పిన ఆధారాల ప్రకారం పోలీసులు సోనీ ఇంటికి వెళ్లి బాబును రక్షించారు. అక్కడి నుంచే బాబు ఫొటోను రైల్వేస్టేషన్‌లో ఉన్న తల్లి మార్గమ్మకు చూపించగా, తన బిడ్డే అని పేర్కొనడంతో నిందితురాలిని అదుపులోకి తీసుకుని బాబును తల్లికి అప్పగించారు. కేవలం రెండు గంటల్లోనే బాబును రక్షించిన కానిస్టేబుళ్లు రాజశేఖర్‌, మాసిరెడ్డిలతో పాటు, ఆర్పీఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, జీఆర్‌పీ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనులకు, ఆటో డ్రైవర్‌ మున్వర్‌ షరీ్‌ఫకు ఎస్పీ నగదు రివార్డు అందజేశారు. తనకు పిల్లలు లేకపోవడంతో బాబును ఎత్తుకెళ్లినట్లు నిందితురాలు పేర్కొంది. రైల్వేస్టేషన్‌లో అపరిచిత వ్యక్తుల్ని నమ్మవద్దని ఎస్పీ అనురాధ ప్రయాణికులకు సూచించారు. మీడియా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే సెక్యూరిటీ కమిషనర్‌ డెమిస్మిత బెనర్జీ, సికింద్రాబాద్‌ ఆర్పీఎఫ్‌  ఎస్‌ఐ గోవింద్‌ నాయుడు ఉన్నారు. 

Read more