యాదాద్రీశుడి సేవలో రాష్ట్రపతి

ABN , First Publish Date - 2022-12-31T03:16:41+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం దర్శించుకున్నారు.

యాదాద్రీశుడి సేవలో రాష్ట్రపతి

లక్ష్మీ నారసింహుడిని దర్శించుకున్న ముర్ము

రాష్ట్రపతి నిలయంలో ఎట్‌ హోం.. కేసీఆర్‌ గైర్హాజరు

సైనిక అమరవీరుల కుటుంబీకులకు సత్కారం

ముగిసిన రాష్ట్రపతి విడిదితిరిగి ఢిల్లీకి పయనం

యాదాద్రి/అల్వాల్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం దర్శించుకున్నారు. హైదరాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం నుంచి బయలుదేరిన ఆమె యాదగిరిగుట్టలోని ఉత్తరదిశలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌ వద్దకు ఉదయం 9.30 గంటలకు చేరుకున్నారు. రాష్ట్రపతి వెంట ఆమె కుమార్తె ఇతిశ్రీ ముర్ము, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాగా, రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్‌, జగదీశ్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పథి, రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. హెలిప్యాడ్‌ నుంచి రాష్ట్రపతి రెండో ఘాట్‌రోడ్డు మీదుగా కొండపైకి వెళ్లారు. ఆలయ అర్చకులు దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ముకు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

రాష్ట్రపతి ముందుగా ప్రధానాలయంలో ధ్వజస్తంభానికి మొక్కి, గర్భాలయంలోని స్వయంభువులను దర్శించుకున్నారు. స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ముఖమండపంలో రాష్ట్రపతి, ఆమె కుమార్తె, రాష్ట్రగవర్నర్‌లకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.. రాష్ట్రపతికి లక్ష్మీనరసింహస్వామి జ్ఞాపికను అందజేయగా, ఆలయ ఈవో గీతారెడ్డి, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి.. స్వామివారి ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. అనంతరం దేవాలయంలో ఏర్పాటుచేసిన ఫొటో గ్యాలరీని రాష్ట్రపతి తిలకించారు. ఉత్తర రాజగోపురం ఎదుట రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మంత్రులు, అధికారులు, దేవాలయ సిబ్బంది ఫొటోలు దిగారు. అయితే కొండపైన రాష్ట్రపతితో మంత్రులు, అధికారులు, ఆలయ సిబ్బందితో నిర్వహించిన ఫొటోసెషన్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి షూ వేసుకుని కూర్చోవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రపతి ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు దేవస్థానంలో ఉన్నారు. 10.30 గంటలకు సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయానికి బయలుదేరారు.

రాష్ట్రపతి నిలయంలో ఎట్‌ హోం..

రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు ‘ఎట్‌ హోం’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పలువురు మంత్రులు, అధికారులు, ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ సహా పలువురు పాత్రికేయులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌ గైర్హాజరు కావడం గమనార్హం. హాజరైన అతిథులందరినీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆప్యాయంగా పలకరించారు. అంతకుముందు రాష్ట్రానికి చెందిన సైనిక అమరవీరుల కుటుంబ సభ్యులతో రాష్ట్రపతి సమావేశమయ్యారు. వారిని తగు రీతిలో సత్కరించారు. ఎట్‌ హోం అనంతరం సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. ఆమెకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, త్రివిధ దళాల అధికారులు, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ హరీశ్‌ వీడ్కోలు పలికారు. కాగా, శీతాకాల విడిది కోసం ఈ నెల 26న సికింద్రాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి నిలయానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన శుక్రవారంతో ముగిసింది.

నృసింహ క్షేత్రం అద్భుతం: రాష్ట్రపతి

యాదగిరిగుట్ట, డిసెంబరు 30: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అద్భుత రీతిలో పునర్నిర్మించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శుక్రవారం ఆమె యాదగిరిక్షేత్రాన్ని సందర్శించిన సందర్భంగా ప్రధానాలయంలో స్వయంభువుల వద్ద పూజల అనంతరం అర్చకులు జరిపిన ఆశీర్వచనం సమయంలో వారితో మాట్లాడారు. యాదగిరిక్షేత్రం పురాణ ప్రాశస్త్యం కలిగిన దేవాలయమని, క్షేత్రాన్ని సందర్శించడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు.

Updated Date - 2022-12-31T03:16:42+05:30 IST