విద్యుత్తు డిమాండ్‌కు రెక్కలు

ABN , First Publish Date - 2022-12-31T03:43:50+05:30 IST

రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్‌ భారీగా పెరిగింది.

విద్యుత్తు డిమాండ్‌కు రెక్కలు

రాష్ట్రంలో భారీగా విద్యుత్తు వినియోగం.. 14,017 మెగావాట్లకు చేరిన డిమాండ్‌

యాసంగి, డిసెంబరులో ఇదే రికార్డు

అప్రమత్తంగా ఉండండి: సీఎం కేసీఆర్‌

15,500 మెగావాట్లకు చేరినా.. సరఫరా చేస్తాం: ట్రాన్స్‌కో సీఎండీ

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్‌ భారీగా పెరిగింది. యాసంగిలో వరి నాట్లు జోరందుకోవడంతో వ్యవసాయ పంపుసెట్ల వినియోగం పెరిగి.. విద్యుత్తు డిమాండ్‌ భారీగా నమోదైంది. ఈ నెల 1వ తేదీ నుంచి 10 వేల మెగావాట్లకు పైగా డిమాండ్‌ రికార్డవుతుండగా.. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో అది 14,017 మెగావాట్లకు చేరింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక యాసంగి సీజన్‌లో, అందులోనూ డిసెంబరులో ఈ స్థాయి డిమాండ్‌ ఏర్పడటం ఇదే తొలిసారి. యాసంగి వరి కీలక దశకు వచ్చే సమయంలో.. రానున్న మార్చిలో ఈ డిమాండ్‌ 15 వేల మెగావాట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యవసాయ డిమాండ్‌ పెరుగుతుండటంతో పగటిపూట.. ప్రధానంగా ఉదయం 10:30 గంటల దాకా వినియోగాన్ని నియంత్రించడానికి వీలుగా త్రీఫేజ్‌ కరెంట్‌ సరఫరాను కట్టడి చేశారు. దీనిపై రైతాంగం నుంచి ప్రతిఘటన ఎదురవుతుండటంతో దానిని పునరుద్ధరించి.. ఉదయం 8 గంటల నుంచే త్రీఫేజ్‌ కరెంట్‌ సరఫరా చేస్తున్నారు.

అయితే పగటిపూటే వ్యవసాయానికి త్రీఫేజ్‌ కరెంట్‌ సరఫరా చేయాలని నిర్ణయం తీసుకోవడంతో రెండు డిస్కమ్‌ల పరిధిలో ఉదయం 8 గంటల నుంచే డిమాండ్‌ అమాంతం పెరుగుతోంది. మరోవైపు వ్యవసాయ వినియోగం పెరుగుతుండటంతో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. 15,500 మెగావాట్ల డిమాండ్‌ వచ్చినా సరఫరా చేయాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా.. ఎంత డిమాండ్‌ వచ్చినా కరెంట్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరగడం, సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని, అయినప్పటికీ పంపుసెట్ల కింద భారీగానే సాగు అవుతోందని అధికారులు గుర్తు చేశారు. దీంతో డిమాండ్‌ పెరుగుతోందని వారు పేర్కొన్నారు. రైతులు కరెంట్‌ను పొదుపుగా వాడుకోవాలని, మోటార్లకు ఆటోమెటిక్‌ స్టార్టర్‌లు ఆఫ్‌ చేయాలని ప్రభాకర్‌రావు కోరారు. కాగా, తెలంగాణలో 31 శాతం మేర విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిందని టీఎ్‌సఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 2023 వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ 4 వేల మెగావాట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నామన్నారు. 2021 డిసెంబరు నాటికి రాష్ట్రంలో 1,66,06,144 విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా 2022 డిసెంబరుకు ఆ సంఖ్య 1,71,197,055కు చేరిందని తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా కొత్త సబ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, విద్యుత్తు లైన్లు వేస్తున్నామని వివరించారు.

Updated Date - 2022-12-31T03:43:50+05:30 IST