షరతులతో డీఏవీ స్కూల్‌కు అనుమతి

ABN , First Publish Date - 2022-11-02T05:34:16+05:30 IST

ఎల్‌కేజీ విద్యార్థిపై లైంగిక దాడి జరిగిన డీఏవీ స్కూల్‌ను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.

 షరతులతో డీఏవీ స్కూల్‌కు అనుమతి

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తాజా అనుమతి ప్రస్తుత విద్యా సంవత్సరానికే

హైదరాబాద్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఎల్‌కేజీ విద్యార్థిపై లైంగిక దాడి జరిగిన డీఏవీ స్కూల్‌ను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. గత నెల 18న ఎల్‌కేజీ విద్యార్థినిపై స్కూల్‌ బస్సు డ్రైవర్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. దాంతో పాఠశాల గుర్తింపును ప్రభుత్వం రద్దు చేసింది. ఇక్కడ చదువుతున్న విద్యార్థులను దగ్గర్లోని ఇతర పాఠశాలల్లో చేర్పించాలని విద్యా శాఖ అధికారులు గతంలో నిర్ణయించారు. అయితే విద్యార్థుల భవిష్యత్తుపై పలుమార్లు అధికారుల సమక్షంలో సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల కొత్త మేనేజ్‌మెంట్‌ సమర్పించిన ప్రతిపాదనల అనంతరం డీఏవీ స్కూల్‌ను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే పాఠశాల నిర్వహణలో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

డీఏవీ స్కూల్‌ నిర్వహణలో పాటించాల్సిన నిబంధనలు

పాత మేనేజ్‌మెంట్‌ను పూర్తిగా తొలగించాలి. కొత్త మేనేజ్‌మెంట్‌లో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యాశాఖ సీనియర్‌ అధికారులకు చోటు కల్పించాలి.

ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు ప్రతినెలా డీఈవో స్కూల్‌ స్టేటస్‌ రిపోర్ట్‌ సమర్పించాలి.

ఆరోపణలు వచ్చిన ఉపాధ్యాయులను తొలగించాలి.

ప్రస్తుతం ఇచ్చిన గుర్తింపు ఈ విద్యా సంవత్సరం వరకే పరిమితం.

ఈ స్కూల్‌లో ఇప్పటి వరకు జరిగిన అవకతవకలపై డీఈవో చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా అనుమతి లేకుండా 6,7 తరగతులను, సీబీఎ్‌సఈ సిలబ్‌సను ప్రారంభించడం వంటి వాటిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలి.

2017లో జారీ చేసిన జీవో-36లో పేర్కొన్న మార్గదర్శకాలను పాటించాలి.

Updated Date - 2022-11-02T09:02:28+05:30 IST
Read more