వాదోపవాదాలు

ABN , First Publish Date - 2022-09-21T14:41:30+05:30 IST

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా ముగిసింది. మూడు సార్లు సమావేశం వాయిదా పడింది. మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి

వాదోపవాదాలు

మేయర్‌ పోడియాన్ని చుట్టుముట్టిన విపక్షాలు

ఎజెండాలో కొన్ని అంశాలపైనే చర్చ

రాజకీయ విమర్శలకే సభ్యుల ప్రాధాన్యం

ఐదు నెలల అనంతరం సమావేశం

చప్పగా సాగిన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ మీటింగ్‌


 పార్టీ మార్పులు.. విమోచన ఉత్సవాలు.. భవన ప్రారంభోత్సవాల వంటి అంశాలపై లొల్లి తప్ప.. మెజార్టీ సభ్యులు ప్రజా సమస్యలను గాలికొదిలేశారు. ఐదు నెలల అనంతరం జరిగిన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చ కంటే రాజకీయపరమైన వాదోపవాదాలకే అధిక ప్రాధాన్యమిచ్చారు. సాగుతూ.. రచ్చలతో వాయిదా పడుతూ కౌన్సిల్‌ సమావేశం చప్పగా సాగింది. 


హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా ముగిసింది. మూడు సార్లు సమావేశం వాయిదా పడింది. మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం సమావేశంలో ప్రశ్నోత్తరాలపై చర్చ సమయంలో అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరు పార్టీ సభ్యులు మేయర్‌ పోడియం వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఇదంతా ప్రజా సమస్యల కోసం కాకుండా, ఆదివాసీ, బంజారా భవన్‌లను తన డివిజన్‌లో ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కార్పొరేటర్‌ కవితారెడ్డి ధన్యవాదాలు చెబుతున్న సమయంలో కావడం గమనార్హం. పార్కుల పరిరక్షణ, హరితహారంపై చర్చ జరుగుతుండగా.. మరోసారి కవితారెడ్డి మాట్లాడారు. బీజేపీ నుంచి టీఆర్‌ఎ్‌సలో చేరిన కార్పొరేటర్లకు ధన్యవాదాలు చెప్పారు. దీనిపై బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రలోభాలకు గురి చేసి తమ పార్టీ కార్పొరేటర్లను చేర్చుకున్నారని ఆరోపించారు. మేయర్‌ పోడియం వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. భోజన విరామం అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగా.. తన పేరు ప్రస్తావించడాన్ని తప్పుబడుతూ విజయారెడ్డి మేయర్‌తో వాగ్వాదానికి దిగారు.


బీజేపీ సభ్యులు కూడా కార్పొరేటర్ల చేరికపై చర్చకు అనుమతి ఇవ్వాలని పట్టుబట్టారు. ఎజెండాలోని అంశాలపై చర్చ ముగిసిన అనంతరం ఇతర విషయాన్ని మాట్లాడాలని మేయర్‌ అన్నారు. సమావేశంలో తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహించిన ప్రధాని నరేంద్రమోదీకి బీజేపీ సభ్యులు కృతజ్ఞతలు తెలపగా టీఆర్‌ఎస్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో సమావేశం ముగిసినట్టు మేయర్‌ ప్రకటించారు. మొత్తంగా ఉదయం 10.40 నుంచి సాయంత్రం 4.35 గంటల వరకు జరిగిన సమావేశంలో ఎజెండాలోని కొన్ని అంశాలు మాత్రమే చర్చించగా.. సంయమనం పాటించకుండా సభ్యులు నిరసనలు, అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పలుమార్లు సమావేశం వాయిదా పడింది. సభలో సభ్యుల వాదోపవాదాలు  విని అధికారులు నవ్వుకోవడం కనిపించింది.


బీజేపీ కార్పొరేటర్లకు ‘బండి’ అభినందనలు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ సర్వసభ్య సమావేశంలో తెలంగాణ విమోచన, గిరిజన గళాన్ని వినిపించిన బీజేపీ  కార్పొరేటర్లకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అభినందలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో సర్కార్‌ తీరును ఎండగట్టిన తీరు భేష్‌ అన్నారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి కాకుండా కాంగ్రె్‌సతో కలిసి కేసీఆర్‌ కుట్ర చేశారని ఆరోపించారు. 


నామ్‌ కే వాస్తేగా... 

ఎస్‌ఎన్‌డీపీ, ఆస్తిపన్ను వసూలు, ఈవీడీఎం పెనాల్టీల విధింపు, పారిశుధ్య నిర్వహణ, అక్రమ నిర్మాణాల నియంత్రణలో వైఫల్యం, దోమల తీవ్రత తదితర ప్రశ్నలపై సమావేశంలో నామ్‌ కే వాస్తేగా చర్చ జరిగింది. దోమల తీవ్రత అధికమైందని, యాక్షన్‌ ప్లాన్‌లు, అవగాహన కార్యక్రమాలని హడావిడి చేసే ఎంటమాలజీ విభాగం క్షేత్రస్థాయిలో పని చేయడం లేదని సభ్యులు మండిపడ్డారు. డెంగీతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, రసాయనాల పిచికారీ జరగడం లేదన్నారు. బఫర్‌ జోన్‌లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, పటాన్‌చెరులోని సీతారామ కాలనీలో రోడ్లను ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారని స్థానిక కార్పొరేటర్‌ ప్రస్తావించారు. ఎస్‌ఎన్‌డీపీ పనులు జరుగుతోన్న తీరుపై బీజేపీ, ఎంఐఎం సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పలువురు అధికార పార్టీ కార్పొరేటర్లు ముంపు సమస్యను ప్రస్తావించారు.


జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.733 కోట్లతో 35 పనులకుగాను 33 ప్రారంభమయ్యాయని, ఒక చోట కోర్టు కేసు వల్ల, మరో చోట ట్రాఫిక్‌ మళ్లింపునకు పోలీసుల అనుమతి రాక మొదలు పెట్టలేదని ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ జియావుద్దీన్‌ తెలిపారు. ప్రభుత్వ విభాగాల నుంచి రూ.5200 కోట్ల ఆస్తిపన్ను వసూలు కావాల్సి ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని బీజేపీ సభ్యులు ప్రశ్నించగా.. మెజార్టీ బకాయిలు ఆస్పత్రులు, యూపీహెచ్‌సీలు, విద్యాసంస్థలు, పోలీస్‌ స్టేషన్ల నుంచి ఉన్నాయని, ప్రజలకు అత్యవసర సేవలందించే ఆ భవనాలను సీజ్‌ చేసే పరిస్థితి ఉండదని కమిషనర్‌ లోకే్‌షకుమార్‌ సమాధానమిచ్చారు. స్వీయ పన్ను మదింపుతో అక్రమాలు జరుగుతున్నాయని ఓ బీజేపీ సభ్యుడు ప్రస్తావించారు. టు-లెట్‌ పోస్టర్లు, వ్యాపార సంస్థల బోర్డులకు పెనాల్టీలు వేయడాన్ని సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. ఈవీడీఎం విభాగం బౌన్సర్లను పెట్టి వసూళ్లకు పాల్పడుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమావేశం ప్రారంభ సమయంలో తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారికి సభ్యులు నివాళి అర్పించారు. 


రోడ్లపై చెత్తను చూస్తే నాకూ సిగ్గుగా ఉంది

‘నగరంలోని రోడ్లపై పేరుకుపోయిన చెత్తను చూస్తే నాకూ సిగ్గుగా ఉంది. పారిశుధ్య నిర్వహణ గాడి తప్పింది. దీంతో కార్పొరేటర్లుగా క్షేత్రస్థాయిలో అందరమూ ఇబ్బందులు పడుతున్నాం’ అని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అన్నారు. కౌన్సిల్‌లో పారిశుధ్య నిర్వహణపై జరిగిన చర్చ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రోడ్లపై వేస్తున్న చెత్తను ఎవరు తొలగిస్తున్నారు, రాంకీనా? జీహెచ్‌ఎంసీనా? అని పలువురు సభ్యులు ప్రశ్నించారు. ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదన్నారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్‌ బదావత్‌ సంతో్‌షకుమార్‌ చెత్త నిర్వహణను వివరించగా, ఆయన సమాధానంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన నాకే మీరేం చెప్పారో అర్థం కాలేదని, క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారానికి ఏం చేయాలో చెప్పాలి కానీ.. శాస్ర్తీయ అంశాల ప్రస్తావన ఎందుకని బాబా ఫసియుద్దీన్‌ పేర్కొన్నారు.


ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ.. ‘నిజంగానే పారిశుధ్య నిర్వహణ సరిగా లేదు. నాకూ సిగ్గుగా ఉంది’ అన్నారు. పారిశుధ్య నిర్వహణ మెరుగుదలకు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సమావేశం ముగిసిన అనంతరం మేయర్‌ వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు ఘాటుగా స్పందించారు. విజయలక్ష్మి మాటలే.. నగరంలో పారిశుధ్య నిర్వహణ ఎంత అధ్వానంగా ఉన్నాయో స్పష్టం చేస్తున్నాయన్నారు. 

Read more