online evaluation: ఇక ఆన్‌లైన్‌ మూల్యాంకనం

ABN , First Publish Date - 2022-11-12T02:36:10+05:30 IST

ఇంటర్మీడియట్‌ పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

online evaluation: ఇక ఆన్‌లైన్‌ మూల్యాంకనం

ముందుగా లాంగ్వేజీ పేపర్లు

విజయవంతమైతే మిగతా సబ్జెక్టులూ..

సిలబస్‌లో మార్పుల కోసం కోర్‌ కమిటీ

సబ్జెక్టుల వారీగా నిపుణులకు చోటు

పోటీ పరీక్షలకు అనుగుణంగా పాఠాలు

కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై ప్రత్యేక దృష్టి

ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్స్‌.. 20ు వెయిటేజీ

మే చివరి నాటికి కాలేజీలకు గుర్తింపు

క్లాసులు మొదలవడానికి ముందే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు

ఇంటర్‌ విద్యామండలి సర్వసభ్య సమావేశంలో నిర్ణయాలు

హైదరాబాద్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్‌ పద్ధతిలో వాల్యుయేషన్‌ను నిర్వహించడానికి ఇంటర్‌ విద్యామండలి ఆమోదం తెలిపింది. తద్వారా మూల్యాంకనం త్వరగా పూర్తవడంతోపాటు మార్కులు, ఆన్సర్‌ షీట్ల వెరిఫికేషన్‌ సులువవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానం ఇప్పటికే పలు యూనివర్సిటీల్లో అమల్లో ఉంది. దాంతో ఇంటర్‌లో కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అన్ని సబ్జెక్టులకు ఒకేసారి కాకుండా ముందుగా లాంగ్వేజీలకు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేయనుంది. ఇందులో విజయవంతమైతే మిగతా సబ్జెక్టు పేపర్లకు కూడా వర్తింపజేయనుంది.

ఈ మేరకు శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్‌ విద్యా మండలి సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో... విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌తోపాటు ఓయూ, జేఎన్‌టీయూ, కాకతీయ, తెలంగాణ తదితర యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్లు పాల్గొన్నారు. ఆన్‌లైన్‌ మూల్యాంకనంతోపాటు ఇంటర్మీడియట్‌ విద్యలో అనేక మార్పులు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యంగా సిలబ్‌సలో మార్పులు, కాలేజీల గుర్తింపు, ఇంగ్లీషు భాషపై విద్యార్థులకు పట్టును పెంచడం కోసం పలు చర్యలు చేపట్టనున్నారు. దీని కోసం ఒక కోర్‌ కమిటీని ఏర్పాటుచేస్తారు. ఆయా సబ్జెక్టుల నిపుణులు ఇందులో ఉంటారు. అలాగే జాతీయ స్థాయిలో నిర్వహించే పలు పరీక్షలకు అనుగుణంగా సిలబ్‌సలో మార్పులు చేస్తారు. జేఈఈ, నీట్‌ వంటి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు ఇప్పటికే సీబీఎ్‌సఈ సిలబ్‌సను చాలావరకు అనుసరిస్తున్నారు. ఈ దిశగా ఇంకా చేపట్టాల్సిన మార్పులపై కమిటీ పరిశీలించనుంది. అలాగే క్లాట్‌ వంటి ప్రవేశ పరీక్షలకు అనుగుణంగా సిలబ్‌సను రూపొందించనున్నారు. కాగా... ఇంటర్‌ పరీక్ష ఫీజును పెంచకూడదని సమావేశంలో నిర్ణయించారు. ఫీజును పెంచాలన్న అధికారుల ప్రతిపాదనను మంత్రి అంగీకరించలేదు.

ఇంగ్లిష్‌ భాషపై పట్టు కోసం..

అలాగే ఇంగ్లిష్‌ భాషపై విద్యార్థులకు పట్టును పెంచడానికి చర్యలు చేపడతారు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పెంపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇంగ్లీషులో థియరీకి 80 శాతం, ప్రాక్టికల్స్‌కు 20 శాతం మార్కులను కేటాయిస్తారు. అదేవిధంగా... ఇంటర్‌ ఎంఈసీ, సీఈసీ గ్రూపుల సిలబ్‌సలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఎంఈసీ, ఎంపీసీ గ్రూపుల్లో మ్యాథ్స్‌ కామన్‌గా ఉంది. అయితే ఎంపీసీ వారికి అవసరమైనంత లోతుగా ఎంఈసీ విద్యార్థులకు మ్యాథ్‌ సబ్జెక్టు అవసరం లేదని సమావేశం అభిప్రాయపడింది. ఈ మేరకు ఎంఈసీ విద్యార్థులకు మ్యాథ్స్‌ కంటే కామర్స్‌ ఎక్కువగా ఉండే విధంగా పుస్తకాల్లో మార్పులు చేస్తారు. మ్యాథ్స్‌ సిలబ్‌సను కొంత తగ్గించి, ఆ మేరకు కామర్స్‌ సబ్జెక్టును పెంచుతారు. అదేవిధంగా... సీఈసీలో సివిక్స్‌ సిలబ్‌సను కొంత తగ్గించి, ఆ మేరకు అకౌంటెన్సీ సబ్జెక్టును పెంచుతారు. అలాగే హెచ్‌ఈసీ గ్రూపులో సివిక్స్‌ సబ్జెక్టును ఇక నుంచి పొలిటికల్‌ సైన్స్‌గా వ్యవహరిస్తారు.

మే నెలాఖరుకల్లా కాలేజీలకు గుర్తింపు

ఇకనుంచి కాలేజీలు తెరిచేనాటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించాలని నిర్ణయించారు. ప్రస్తుతం కాలేజీలు తెరిచిన తర్వాత పుస్తకాల ముద్రణకు ఆర్డర్‌ ఇస్తున్నారు. దీంతో పుస్తకాలు విద్యార్థులకు చేరడానికి కనీసం రెండు నెలలు పడుతోంది. ఈ పరిస్థితిని మార్చడానికి... వచ్చే ఏడాదికి సంబంధించిన పుస్తకాల ముద్రణను ఇప్పుడే మొదలుపెట్టాలని నిర్ణయించారు. అలాగే కాలేజీల గుర్తింపు ప్రక్రియలో కూడా మార్పులు చేయనున్నారు. ఈ ఏడాదికి సంబంధించిన గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. సుమారు 350 కాలేజీలకు గుర్తింపు రాలేదు. మరోవైపు ఆయా కాలేజీల్లో ఫస్టియర్‌ అడ్మిషన్లు జరిగాయి. సెకండియర్‌ విద్యార్థులు కూడా చదువుకుంటున్నారు. మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీ, ఫైర్‌ సర్వీసెస్‌ విభాగం నుంచి ఎన్‌వోసీ లేకపోవడం వంటి కారణాలతో ఈ కాలేజీలకు ఇంకా గుర్తింపు దక్కలేదు. వచ్చే ఏడాది నుంచి... మే నెల చివరినాటికే కాలేజీల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు.

Updated Date - 2022-11-12T05:43:53+05:30 IST

Read more