DH Srinivasa Rao: ఆయన పాదాలను తాకడం ఎంతో అదృష్టం

ABN , First Publish Date - 2022-11-21T03:16:21+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నా దృష్టిలో తెలంగాణ బాపు...

DH Srinivasa Rao: ఆయన పాదాలను తాకడం ఎంతో అదృష్టం

నాదృష్టిలో ఆయన తెలంగాణ బాపు

కేసీఆర్‌ నాకు పితృసమానులు

ఆయన పాదాలను తాకడం అదృష్టం

డీహెచ్‌ గడల సంచలన వ్యాఖ్యలు

సోషల్‌ మీడియాలో వైరల్‌

హైదరాబాద్‌/లక్ష్మీదేవిపలి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ నా దృష్టిలో తెలంగాణ బాపు. ఆయన పాదాలకు నమస్కరిస్తే తప్పేంటి?. ఒక్కసారి కాదు.. వందసార్లు అయినా కేసీఆర్‌ కాళ్లు మొక్కుతా’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకుడు (డీహెచ్‌) గడల శ్రీనివాసరావు సంచలన వాఖ్యలు చేశారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో జరిగిన మున్నూరుకాపు కార్తీక వన సమారాధన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. డీహెచ్‌ చేసిన వ్యాఖ్యలు క్షణాల్లో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ముఖ్యంగా వైద్యఆరోగ్యశాఖ వాట్సాప్‌ గ్రూపుల్లో విపరీతంగా ఫార్వర్డ్‌ అయ్యాయి. ఇటీవల ప్రగతి భవన్‌లో కొత్తమెడికల్‌ కాలేజీల ప్రారంభోత్సవాన్ని సీఎం కేసీఆర్‌ ఆన్‌లైన్‌ ద్వారా చేశారు. ఆ రోజు సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గడల రెండుసార్లు ఆయన కాళ్లకు నమస్కరించారు. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెడికల్‌ కాలేజీని ప్రారంభించిన సందర్భంలోనే ఆ జిల్లా బిడ్డగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ తాను పాదాభివందనం చేశానని ఆయన ఇప్పటికే ప్రకటించారు.

ఈ క్రమంలో మున్నూరు కాపు వన భోజనాల వేడుక లో మరోమారు స్పందించారు. బంగారు తెలంగాణ సాధన దిశగా పాటుపడుతున్న పరిపాలనాదక్షుడు సీఎం కేసీఆర్‌ను తాను పితృ సమానులుగా భావిస్తానని అన్నారు. కేసీఆర్‌తో ఫొటో దిగడం, ఆయన పాదాలను తాకడాన్ని తాను ఎంతో అదృష్టంగా భావిస్తాననే విషయాన్ని కొవిడ్‌ సమయంలోనే అనేక మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో వెల్లడించానని చెప్పారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఆరోగ్య తెలంగాణ సాధన కోసం సీఎం చేస్తున్న యజ్ఞంలో భాగస్వామ్యులుగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు.

Updated Date - 2022-11-21T10:22:08+05:30 IST