బీఆర్‌ఎస్‌ కాదు.. ఇక వీఆర్‌ఎస్‌!

ABN , First Publish Date - 2022-12-10T03:05:12+05:30 IST

టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌ కాదు.. ఇకపై వీఆర్‌ఎస్‌ (స్వచ్ఛంద విరమణ పథకం) కాబోతున్నదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

బీఆర్‌ఎస్‌ కాదు.. ఇక వీఆర్‌ఎస్‌!

మూడోసారి గెలిచేందుకే టీఆర్‌ఎస్‌ పార్టీ పేరు మార్పు

ఆమ్‌ ఆద్మీ, ఎంఐఎం, బీఆర్‌ఎ్‌సలు బీజేపీకి బీ టీమ్‌లు: రేవంత్‌రెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 9: టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌ కాదు.. ఇకపై వీఆర్‌ఎస్‌ (స్వచ్ఛంద విరమణ పథకం) కాబోతున్నదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో మూడోసారి అధికారం చేపట్టేందుకే టీఆర్‌ఎస్‌ పార్టీ పేరును మార్చారని వ్యాఖ్యానించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు బీజేపీకి బీ టీమ్‌లు అని.. కేసీఆర్‌, కేజ్రీవాల్‌, అసదుద్ద్దీన్‌లు కాంగ్రె్‌సను చంపే సుపారీ కిల్లర్స్‌ అని మండిపడ్డారు. శుక్రవారం నిజామాబాద్‌లో ఓ ఫంక్షన్‌కు హాజరైన ఆయన.. ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో బీఆర్‌ఎ్‌సకు కాంగ్రెస్‌ పార్టీనే ప్రత్యామ్నాయం. బీజేపీకి అంత సీన్‌ లేదు.

నాలుగు ఎంపీ సీట్లు గెలిచినంత మాత్రాన ప్రత్యామ్నాయం అయిపోతారా? పార్టీలు మార్చే కేసీఆర్‌ను ప్రజలు నమ్మరు. ముఖ్యమంత్రి తాత్కాలిక ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టినా.. కేసీఆర్‌ పట్టించుకోలేదు. వాటిపై మేం పోరాటం చేసినప్పుడు కేసీఆర్‌ ఎటు పోయారు?’’ అని రేవంత్‌ ప్రశ్నించారు. ధరణి సమస్యలను పరిష్కరించలేని సీఎం.. దేశంలో రైతు రాజ్యం ఎలా తెస్తారని నిలదీశారు. తెలంగాణలో పంటల బీమా లేదని, గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేసి కేసీఆర్‌ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. మద్యం కుంభకోణంలో నిందితులుగా పేర్కొంటున్న అందరినీ ఢిల్లీకి పిలిచి.. ఎమ్మెల్సీ కవితను మాత్రమే ఇంట్లో విచారించడం ఏమిటని రేవంత్‌ ప్రశ్నించారు.

Updated Date - 2022-12-10T03:05:13+05:30 IST