ఈడీ, సీబీఐ, ఐటీ దాడులకు భయపడం

ABN , First Publish Date - 2022-11-24T02:48:17+05:30 IST

ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ తమపై ఉసిగొల్పినా, ఎవరికీ భయపడే ప్రసక్తేలేదని, నిలబడి కొట్లాడతామని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. రాం రాం జప్నా.

ఈడీ, సీబీఐ, ఐటీ దాడులకు భయపడం

రాముడి పేరుతో బీజేపీ రౌడీయిజం.. కావాలనే ఐటీ దాడులు చేయిస్తున్నారు

అందరివీ చట్టబద్ధ వ్యాపారాలే.. సంతోష్‌ విచారణకు ఎందుకు రావట్లేదు?

దొరికిన దొంగలను విచారించవద్దా?.. సంజయ్‌ ఎందుకు ఏడ్చారో?: కవిత

ఈడీ దాడులకు ప్రతిదాడులు తప్పవు.. మా దగ్గర ఏసీబీ, విజిలెన్స్‌ ఉన్నాయి

పిట్ట బెదిరింపులకు మేం భయపడం.. మల్లారెడ్డి ఏం అక్రమాలకు పాల్పడ్డారు

మేం మీలాగా ఆలోచిస్తే గంట చాలు.. బీజేపీ నేతలనుద్దేశించి శ్రీనివాస్‌గౌడ్‌

నిజామాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి)/నాగిరెడ్డిపేట, నవంబరు 23: ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ తమపై ఉసిగొల్పినా, ఎవరికీ భయపడే ప్రసక్తేలేదని, నిలబడి కొట్లాడతామని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. రాం రాం జప్నా.. పరాయా లీడర్‌ అప్నా.. అన్నదే బీజేపీ పని అని, ఆ పార్టీకి ఒక సిద్ధాంతం అంటూ లేదని మండిపడ్డారు. బుధవారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశానికి కవిత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయంగా బలంగా ఎదిగిన పార్టీ నాయకులను గద్దల్లాగా ఎత్తుకుపోవాలని బీజేపీ ఆలోచిస్తోందన్నారు. రాముడు పేరు చెప్పి రౌడీయిజం చేయాలనేది బీజేపీ పద్ధతి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు బీజేపీ నాయకులకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న లీడర్‌లు పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదని, అందుకే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలపై కాషాయం పార్టీ పెద్దలు కేసులు పెట్టించి ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. బీజేపీలో చేరకపోతే ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను ఉసిగొలుపుతున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను.. ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా నెల రోజులుగా ఐటీ దాడులు చేయిస్తున్నారని.. అయినా అందరూ చట్టబద్ధంగానే వ్యాపారాలు చేస్తున్నారని, భయపడాల్సిన అసరం లేదని పేర్కొన్నారు. అధికారులు వివరాలు అడిగితే అన్ని అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వచ్చినవారు.. బీజేపీ జాతీయ అగ్రనేత బీఎల్‌ సంతోష్‌ పేరు ప్రస్తావించారన్నారు. ఈ నేపథ్యంలో సిట్‌ అధికారులు బీఎల్‌ సంతో్‌షను విచారణ కోసం పిలిచినా ఎందుకు రావడం లేదని, అంత భయమెందుకని ప్రశ్నించారు. దొరికిన దొంగలను విచారణ చేయవద్దా? అని నిలదీశారు. రాష్ట్ర మంత్రులను విచారణకు పిలిస్తే హాజరవుతున్నారని.. కానీ సంతోష్‌ మాత్రం రావడం లేదని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎందుకు ఏడ్చారో అర్థం కాలేదన్నారు. పాదయాత్రలో భాగంగా రాహుల్‌గాంధీ తెలంగాణకు ఎందుకు వచ్చారో ఆయనకే తెలియదని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదన్నారు. రాష్ట్రంలో మళ్లీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని కవిత ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2022-11-24T02:48:18+05:30 IST