మూసీపై ‘పారిస్‌’ వంతెనలు

ABN , First Publish Date - 2022-11-25T00:38:30+05:30 IST

మూసీ నదిపై పారిస్‌ తరహాలో బ్రిడ్జిలు నిర్మించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇటీవల ఐదు రోజులపాటు అధ్యయనం కోసం పారిస్‌ పర్యటనకు వెళ్లిన నగర ఇంజనీరింగ్‌, పట్టణ ప్రణాళికా విభాగం ఉన్నతాధికారులు.. అక్కడ పరిశీలించిన అంశాలకు సంబంధించిన నివేదికను సిద్ధం చేస్తున్నారు.

మూసీపై ‘పారిస్‌’ వంతెనలు

నిర్మాణ సాధ్యాసాధ్యాల పరిశీలన

చారిత్రక వైభవం, స్థానికత ప్రతిబింబించేలా డిజైన్లు

పారిస్‌ అధ్యయన యాత్ర నుంచి తిరిగి వచ్చిన ఉన్నతాధికారులు

త్వరలో ప్రభుత్వానికి నివేదిక

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): మూసీ నదిపై పారిస్‌ తరహాలో బ్రిడ్జిలు నిర్మించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇటీవల ఐదు రోజులపాటు అధ్యయనం కోసం పారిస్‌ పర్యటనకు వెళ్లిన నగర ఇంజనీరింగ్‌, పట్టణ ప్రణాళికా విభాగం ఉన్నతాధికారులు.. అక్కడ పరిశీలించిన అంశాలకు సంబంధించిన నివేదికను సిద్ధం చేస్తున్నారు. త్వరలో నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు. చారిత్రక వైభవం, స్థానికతను ప్రతిబింబించేలా పారి్‌సలో బ్రిడ్జిలు నిర్మించిన దృష్ట్యా.. ఇక్కడా అదేవిధంగా బ్రిడ్జిలు డిజైన్‌ చేయాలని యోచిస్తున్నారు. పారి్‌సలోని ఇంజనీరింగ్‌ ఉన్నతాధికారులతోపాటు.. అక్కడి ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌/ఇంజనీర్‌ మార్క్‌ మిమ్రామ్‌తోనూ హైదరాబాద్‌ నుంచి వెళ్లిన అధికారుల బృందం పలు అంశాలపై చర్చించింది. నదిలో వంతెనల నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనుకుంటే ముందస్తుగా చేపట్టిన చర్యలు తదితర విషయాలను వారు వివరించినట్టు జీహెచ్‌ఎంసీ అధికారొకరు తెలిపారు. మార్కమ్‌ మిమ్రామ్‌ కార్యాలయంలో బ్రిడ్జిలకు సంబంధించి కర్రలతో చేసిన నమూనాలనూ బృందం పరిశీలించింది. ఐదు రోజులపాటు పారి్‌సలో ఉన్న అధికారులు నదిపై వంతెనలతోపాటు, పలు చారిత్రక కట్టడాలు, వాటి పరిరక్షణ/పునరుద్ధరణకు చేపట్టిన చర్యలను తెలుసుకున్నారు. ఇక్కడి భౌగోళిక స్వరూపం, నదికి ఇరువైపులా ఉన్న నిర్మాణాలను దృష్టిలో ఉంచుకొని పారిస్‌ తరహా లో బ్రిడ్జిల నిర్మాణ సాధ్యాసాధ్యాలపై తుది నిర్ణయానికి రానున్నారు.

సెన్‌ నదిపై 37 బ్రిడ్జిలు..

పారి్‌సలోని సెన్‌ నదిపై 37 బ్రిడ్జిలున్నాయి. ఇందులో కొన్ని పాదచారుల వంతెనలు కాగా, మెజార్టీ వాహనాల రాకపోకల కోసం నిర్మించినవి. నగరం మధ్యలో అక్కడి నది ఉన్న నేపథ్యంలో ఇరువైపుల ప్రాంతాలను కలుపుతూ నదిపై బ్రిడ్జిలు నిర్మించారు. చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి అయిన పారి్‌సలో పర్యాటకులను ఆకర్షించడంలో ఈఫిల్‌ టవర్‌తోపాటు అక్కడి పురాతన కట్టడాలు కీలకంగా ఉన్నాయి. నదికి ఇరువైపులా ఉన్న చారిత్రక కట్టడాలకు కొనసాగింపుగా వంతెనలను డిజైన్‌ చేశారు. నదిలో ఎప్పుడూ నీరు ఉంటున్న నేపథ్యంలో తీర ప్రాంతాల్లో సందర్శకులు సేద తీరేలా పర్యాటకం అభివృద్ధి చేశారు. నదిపై ఉన్న 37వంతెనల పొడవు దాదాపు 13కి.మీ.లు ఉంటుంది. సెన్‌ నదిపై ఉన్న పాండ్‌ డె సల్లీ బ్రిడ్జి నుంచి పాండ్‌ అలెగ్జాండర్‌-3 మీదుగా పాండ్‌ డె బిర్‌- హకీం వరకు వంతెనలున్న ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించింది. ఇది అక్కడి వంతెనల నిర్మాణ ప్రాశస్త్యానికి నిదర్శనమని చెబుతుంటారు. పారిస్‌ వారసత్వ సంపదకు బ్రిడ్జిలూ ప్రతీక అన్న అభిప్రాయముంది.

చారిత్రక వైభవం కొనసాగిస్తూ..

పారి్‌సలో 1900వ సంవత్సరం, అంతకంటే ముందు అక్కడి ప్రభుత్వం నిర్మించిన చారిత్రక కట్టడాలున్నాయి. వాటి ముఖాకృతి దెబ్బ తినకుండా పునరుద్ధరిస్తూ కట్టడం లోపల పలుమార్పులు చేశారు. భవనం ముందు భాగం నాటి వారసత్వ కౌశలం ప్రతిబింబించేలా పరిరక్షిస్తూ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా లోపలి భాగంలో కేబిన్‌లు, ఏసీలు, ఇతరత్రా ఏర్పాట్లు చేస్తు ఆధునికీకరించారు. నగరంలోనూ వందల సంఖ్యలో చారిత్రక కట్టడాలున్నాయి. వీటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పారి్‌సలో అవలంబించిన విధానాల అమలును పరిశీలించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.

మూసీపై 14 బ్రిడ్జిలు..

మూసీపై 14 బ్రిడ్జిలు, ఓ అనుసంధాన రహదారి నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో అఫ్జల్‌గంజ్‌ వద్ద పాదచారుల వంతెన మినహా మిగతావన్నీ(13) హై లెవల్‌ బ్రిడ్జిలు. రూ.545 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలకు ఈ యేడాది జూలైలో ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. ముసారాంబాగ్‌, చాదర్‌ఘాట్‌ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే బ్రిడ్జిలున్నా.. నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో నీట మునుగుతున్నాయి. దీంతో పలు మార్గాల్లో రెండు, మూడు రోజులపాటు వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న బ్రిడ్జిల కంటే ఎక్కువ ఎత్తులో కొత్త వంతెనలు నిర్మించాలని నిర్ణయించారు. పారిస్‌ పర్యటన నేపథ్యంలో.. కొత్త బ్రిడ్జిలను నగర చారిత్రక వైభవం చాటేలా, స్థానికత ప్రతిబింబించేలా డిజైన్‌ చేయాలని భావిస్తున్నారు.

Updated Date - 2022-11-25T00:38:30+05:30 IST

Read more