మోదీ గో బ్యాక్‌

ABN , First Publish Date - 2022-11-12T04:41:37+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం పర్యటన సందర్భంగా నిరసనలు వెల్లువెత్తాయి.

మోదీ గో బ్యాక్‌

గోదావరిఖనిలో కార్మిక సంఘాల నిరసన

గోదావరిఖని/హైదరాబాద్‌/తార్నాక, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం పర్యటన సందర్భంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రధాని గో బ్యాక్‌ అంటూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని కార్మిక సంఘాలు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిర్వహించిన నిరసన ర్యాలీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదిన్నర క్రితం ప్రారంభమైన ఆర్‌ఎ్‌ఫసీఎల్‌ను ఇప్పుడు జాతికి అంకితం చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

ఇప్పటికే నరేంద్రమోదీ దేశంలోని టెలికాం, ఎల్‌ఐసీ, రైల్వేలను ప్రైవేట్‌పరం చేశారని, కోల్‌ ఇండియాలోని బొగ్గు గనులను కూడా వేలం వేస్తున్నారని, అందులో సింగరేణిని కూడా ప్రైవేట్‌పరం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో జరిగిన ఉద్యోగాల కుంభకోణంపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు.. టీఆర్‌ఎస్‌ అనుబంధ సంఘం టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఆర్‌ఎ్‌ఫసీఎల్‌ను అమ్మేందుకే మోదీ వస్తున్నారని యూనియన్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. సీఐటీయూ నాయకులు కూడా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలోనూ బైక్‌ ర్యాలీని నిర్వహించారు. ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకోవాలంటూ గోదావరిఖనిలోని వర్తక, వ్యాపార కేంద్రాల్లో ప్రచారం నిర్వహించారు. కాగా, దేశంలోని ఆర్థిక వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టించిన ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఓయూ జేఏసీ అధ్యక్షుడు మందాల భాస్కర్‌, అశోక్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో మోదీ పర్యటనను నిరసిస్తూ శుక్రవారం ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆర్ట్స్‌ కాలేజీ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా నేడు వామపక్షాల నిరసనలు

రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవం, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీకి శనివారం కూడా వామపక్షాలు నిరసన తెలపనున్నాయి. సీపీఎం, సీపీఐ అనుబంధ కార్మిక సంఘాలు, గిరిజన, విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాయి.

Updated Date - 2022-11-12T04:41:37+05:30 IST

Read more