ఆదివాసీల ఆత్మగౌరవాన్ని కాపాడుతాం

ABN , First Publish Date - 2022-09-12T03:53:57+05:30 IST

ఆదివాసీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, సత్యవతిరాథోడ్‌ అన్నారు.

ఆదివాసీల ఆత్మగౌరవాన్ని కాపాడుతాం

  మంత్రులు తలసాని, శ్రీనివా్‌సగౌడ్‌, సత్యవతిరాథోడ్‌

బంజారాహిల్స్‌, సెప్టెంబర్‌ 11 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, సత్యవతిరాథోడ్‌ అన్నారు. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 10లో రాష్ట్ర ప్రభుత్వం రూ.44 కోట్లతో నిర్మించిన సేవాలాల్‌ బంజారాభవన్‌, కొమురంభీమ్‌ భవనాలను ఈ నెల 17న సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో భవనంలోని సదుపాయాలు, ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఆదివారం వారు మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌లతో కలిసి పరిశీలించారు. అనంతరం సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ నగరం నడిబొడ్డున రెండెకరాల స్థలంలో ఈ నిర్మాణాలు చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గిరిజనులు తాము ఉంటున్న ఏజెన్సీ ప్రాంతాల్లోని తండాలను, గూడాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసుకుని గౌరవంగా పాలిస్తున్నారని గుర్తు చేశారు. తలసాని మాట్లాడుతూ గిరిజనులపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్న కేంద్రం ఇంత వరకూ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. గిరిజన యూనివర్సిటీ, 10 శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. రిజర్వేషన్‌ అమలు కోసం తీర్మానం చేసి పంపినా కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. కార్యక్రమంలో మహబూబాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ అంగోత్‌ బిందు, జీసీసీ చైర్మన్‌ వాల్యానాయక్‌, కార్పొరేటర్‌ మన్నె కవితరెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు రూప్‌సింగ్‌, గిరిజన శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చొంగ్తూ, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-12T03:53:57+05:30 IST