ఈడీ ముందుకు మంత్రి తలసాని మరో పీఏ

ABN , First Publish Date - 2022-12-13T03:15:59+05:30 IST

క్యాసినో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సంబంధీకుల చుట్టే తిరుగుతోంది.

ఈడీ ముందుకు మంత్రి తలసాని మరో పీఏ

క్యాసినో కేసులో అశోక్‌ను ప్రశ్నించిన ఈడీ

హైదరాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): క్యాసినో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సంబంధీకుల చుట్టే తిరుగుతోంది. ఈ కేసులో తలసాని సోదరులు మహేశ్‌ యాదవ్‌, ధర్మ యాదవ్‌ను ఈడీ అధికారులు గత నెలలో విచారించారు. తలసాని పీఏ హరీష్‌ను కూడా ప్రశ్నించారు. తాజాగా మంత్రి మరో వ్యక్తిగత సహాయకుడు (పీఏ) అశోక్‌ను ఈడీ అధికారులు విచారించడం సంచలనంగా మారింది. అశోక్‌ బ్యాంకు ఖాతా నుంచి లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన ఈడీ అధికారులు... ఆ కోణంలో విచారిస్తున్నారు. ఈడీ నోటీసులు అందుకున్న అశోక్‌ సోమవారం బషీర్‌బాగ్‌లోని ఆ సంస్థ కార్యాలయానికి చేరకున్నారు. బ్యాంకు ఖాతా వివరాలతోపాటు ఇతర పత్రాలు వెంటతీసుకెళ్లారు. కొన్ని గంటల పాటు అశోక్‌ను విచారించిన ఈడీ అధికారులు అవసరమైతే మరోసారి పిలుస్తామని చెప్పి పంపించినట్లు తెలిసింది. చీకోటి ప్రవీణ్‌ కుమార్‌ ఈ ఏడాది జనవరిలో నేపాల్‌లో నిర్వహించిన క్యాసినోకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రముఖుల్ని తరలించినట్లు ఈడీ గుర్తించింది. ఫెమా నిబంధనలకు విరుద్ధంగా నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. క్యాసినో కేసులో ఇప్పటికే పలువుర్ని ఈడీ అధికారులు విచారించారు. మరికొంత మందికి నోటీసులు జారీ చేశారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎల్‌ రమణతోపాటు ఏపీకి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌ రెడ్డి, ఇతర ప్రముఖులు క్యాసినో కేసులో ఈడీ విచారణకు హాజరైన వారిలో ఉన్నారు. నేపాల్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన, ఆహ్వానాలు అందిన వారిలో ఎమ్మెల్యేలులు, ఎమ్మెల్సీలు 18 మంది వరకు ఉన్నారని, క్యాసినోకు వెళ్లే రెగ్యులర్‌ కస్టమర్ల సంఖ్య 280 వరకు ఉందని ప్రాథమిక విచారణలో గుర్తించిన ఈడీ అందులో అవసరమైన వారందరికీ నోటీసులు జారీ చేసి విచారిస్తోంది.

Updated Date - 2022-12-13T03:16:05+05:30 IST