Minister Mallareddy: మమ్మల్నే కాదు.. కేసీఆర్‌ను కూడా ఏం చేయలేరు..

ABN , First Publish Date - 2022-11-24T11:39:08+05:30 IST

మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy), ఆయన సోదరులు, కుమారులు, అల్లుడుకు సంబంధించిన ఇళ్లు, సంస్థల్లో ఐటీ అధికారులు (IT Officials) రెండు రోజులుగా సోదాలు చేసిన విషయం తెలిసిందే.

Minister Mallareddy: మమ్మల్నే కాదు.. కేసీఆర్‌ను కూడా ఏం చేయలేరు..

హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy), ఆయన సోదరులు, కుమారులు, అల్లుడుకు సంబంధించిన ఇళ్లు, సంస్థల్లో ఐటీ అధికారులు (IT Officials) రెండు రోజులుగా సోదాలు చేసిన విషయం తెలిసిందే. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా గురువారం మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ దాడుల విషయం సీఎం కేసీఆర్‌ (CM KCR) ముందే చెప్పారన్నారు. తెలంగాణపై బీజేపీ (BJP) కుట్రలు చేస్తోందని, సీఎం కేసీఆరే మా ధైర్యమని, అంతా ఆయనే చూసుకుంటారని అన్నారు. ఈ బీజేపీ మమ్మల్నే కాదు.. ముఖ్యమంత్రిని కూడా ఏం చేయలేదని అన్నారు. ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యను అందించానని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు.

కేంద్ర బలగాలతో తమపై పెద్ద ఎత్తున దాడులు చేశారని, గతంలో రెండు సార్లు దాడులు జరిగాయని, అయితే ఈ విధంగా జరగడం తాను ఎప్పుడూ చూడలేదని మంత్రి మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పాలు అమ్మి.. బోర్లు వేసి పైకి వచ్చానన్నారు. తన కొడుకు చదవాలన్నా సీటు ఇప్పించుకోలేని పరిస్థితి తనదని అన్నారు. ఎందుకంటే అంతా ఆన్‌లైన్ (Online) ద్వారానే జరుగుతుందన్నారు. మేనేజ్‌మెంట్‌ కోటా లేకపోతే డొనేషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీపావళి రోజున ఇంట్లో పూజ చేశానని అప్పుడు ఇంట్లో రూ. 3 లక్షలే ఉన్నాయని ఆ డబ్బులే పూజ వద్ద పెట్టానని చెప్పారు. తన కొడుకు ఆస్పత్రిలో ఉన్నా అధికారులు కనికరం చూపలేదన్నారు. తన పెద్దకొడుకును మానసికంగా వేధించి సంతకం పెట్టించారని, అధికారులే ఇలా మోసం చేస్తారని అనుకోలేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు.

దాడుల్లో ఏదైనా దొరికితే చూపించాలి కదా? అని మల్లారెడ్డి అన్నారు. రూ.100 కోట్ల బ్లాక్‌ మనీ ఉందని సంతకం పెట్టించుకున్నారని, లేని డబ్బును ఎక్కడ చూపించాలని ప్రశ్నించారు. ఇప్పుడు పార్ట్‌-1 మాత్రమే అయిందని ఇంకా పార్ట్‌ 2, 3 ఉందన్నారు. ఇక మూడు నెలలు తమను వేధిస్తూనే ఉంటారన్నారు. ఆయకార్‌ భవన్‌లో ఇంకా సినిమా ఉందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దాడులు ఉండవా? అని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2022-11-24T13:23:11+05:30 IST