Errabelli: కొత్త పార్టీ ఏర్పాటు తరువాత సమీకరణలు మారుతాయి...

ABN , First Publish Date - 2022-10-03T17:51:05+05:30 IST

కొత్త పార్టీ ఏర్పాటు తర్వాత సమీకరణాలు మారతాయని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

Errabelli: కొత్త పార్టీ ఏర్పాటు తరువాత సమీకరణలు మారుతాయి...

హైదరాబాద్: సీఎం కేసీఆర్ (CM KCR) కొత్త పార్టీ (New Party) ఏర్పాటు తర్వాత ఏపీ (AP), మహారాష్ట్ర (Maharastra), కర్ణాటక (Karnataka) లాంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రాజకీయ సమీకరణలు మారుతాయని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు (Errabelli Dayakara Rao) అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పెట్టబోయే కొత్త పార్టీ ద్వారా ఎదో సాధించకపోయినా.. ఇతర పార్టీల్లో ఉండి అసంతృప్తిలో ఉన్న చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వస్తారన్నారు. తద్వారా కొత్త పార్టీలోకి అనేక చేరికలు జరుగుతాయన్నారు. తాము ఆశించిన స్థాయిలో కాకపోయినా రాష్ట్రానికి ఒక ఎంపీ, ఎమ్మెల్యే గెలిచినా.. తమ టార్గెట్ రీచ్ అయినట్లేనని ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. 


తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ.. ఇకపై భారత రాష్ట్ర సమితిగా మారనుంది. తెలంగాణ పరిధి నుంచి జాతీయ స్థాయి పార్టీగా రూపాంతరం చెందనుంది. ఉద్యమ పార్టీ నుంచి.. ప్రాంతీయ పార్టీ అధినేతగా మొదలైన కేసీఆర్‌ ప్రస్థానం జాతీయ పార్టీ అధ్యక్షుడి స్థాయికి చేరనుంది. విజయదశమి రోజు మధ్యాహ్నం 1.19 నిమిషాలకు కేసీఆర్‌ జాతీయ రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. పార్టీ జెండా ఇప్పుడున్నట్లు గులాబీ రంగులోనే ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడున్న జెండానే ఉండనుంది. పార్టీ గుర్తు కూడా కారే ఉంటుంది. ఆ గుర్తే ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడగనున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదివారం స్వయంగా తొలిసారి పార్టీ నేతలకు జాతీయ పార్టీ గురించి ఈ వివరాలు వెల్లడించారు. వాస్తవానికి టీఆర్‌ఎస్‌ పార్టీని 2001లో రిజిస్ట్రేషన్‌ చేసినప్పుడు.. పార్టీ పరిధిని తెలంగాణ ప్రాంతం వరకే పేర్కొన్నారు.  పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితిగా పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పార్టీ పేరు స్థానంలో భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌)అని మార్చనున్నారు.

Updated Date - 2022-10-03T17:51:05+05:30 IST