పోదాం పద జాతర

ABN , First Publish Date - 2022-02-16T13:57:43+05:30 IST

నగరం నుంచి భక్తులు మేడారానికి వెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.

పోదాం పద జాతర

మేడారం జాతర

నేటినుంచే తెలంగాణ కుంభమేళా                                                                                                                              

దారులన్నీ మేడారం వైపే కదులుతున్నాయి. మూటాముల్లెలతో భక్త జనం వన  దేవతల సన్నిధికి తరలుతున్నారు. అరణ్యం క్రమ క్రమంగా జనారణ్యమై పోటెత్తుతోంది. ములుగు జిల్లా (పూర్వ ఉమ్మడి వరంగల్‌ జిల్లా) తాడ్వాయి మండలంలోని మేడారం.. సాధారణ రోజుల్లో ఓ పల్లె మాత్రమే. ఇప్పుడది  మహానగర శోభతో కాంతులు విరజిమ్ముతోంది. కుంభమేళా వలె ఆవిష్కృతమవుతోంది.  బుధవారం సారలమ్మ రాకతో మహాజాతర పర్వానికి తెర తొలగనుండగా, నాలుగురోజుల పాటు భక్తిపారవశ్యంతో మేడారం ఉప్పొంగిపోనుంది. ఆదివాసీ సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీకగా కనిపించే మేడారం మహాజాతరను తిలకించడం ఒక ఉద్విగ్న అనుభవం.  మరి ఇంకెందుకు ఆలస్యం.. చలో మేడారం.


నగరం నుంచి ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌ సిటీ: నగరం నుంచి భక్తులు మేడారానికి వెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతున్నట్లు, మంగళవారం 20కి పైగా బస్సులు మేడారానికి వెళ్లినట్లు తెలిపారు. మేడారంలో సేవలం దించేందుకు గ్రేటర్‌జోన్‌ నుంచి 48 మంది ఆర్టీసీ అధికారులు వెళ్లారని వెల్లడించారు. అమ్మవార్లకు బంగారం (బెల్లం) మొక్కులను సమర్పించేలా ఆర్టీసీ అందిస్తున్న కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.


విస్తృత ఏర్పాట్లు.. ఎన్నో ఆకర్షణలు..

జాతర నిర్వహణకు 30వేల మంది ఉద్యోగులు, సిబ్బందిని నియమించారు. 

జాతరలో భక్తుల కోసం 35 హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేశారు.  

10లక్షల  కరోనా కిట్లు అందుబాటులో ఉంచారు.

భక్తులను గద్దెల వద్ద వరకు ఉచితంగా తరలించేందుకు 

30 ఆర్టీసీ బస్సులు సిద్ధం

ఫైర్‌ ఎయిర్‌బెలూన్‌ ద్వారా 50 అడుగుల నుంచి 300 అడుగుల ఎత్తు వరకు వెళ్లి అక్కడినుంచి జాతర విహంగ వీక్షణం చేయవచ్చు. చార్జి రూ.800.  

ప్రథమ చికిత్స అందించేందుకు 108 అంబులెన్సు బైక్‌లను సిద్ధం.

1800 425 0520, 1800 425 0620 టోల్‌ ఫ్రీ నెంబర్ల ఏర్పాటు. జాతర పరిసరాల్లో 382 సీసీ కెమెరాల ఏర్పాటు.

భక్తులకు ఉచిత వసతి కోసం మూడు భారీ షెడ్‌ల నిర్మాణం.

Updated Date - 2022-02-16T13:57:43+05:30 IST