ఐటీ అధికారుల ఎదుట ‘మల్లారెడ్డి’ సిబ్బంది

ABN , First Publish Date - 2022-11-30T03:56:05+05:30 IST

మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, ఆయన విద్యా సంస్థల్లో పని చేస్తున్న సిబ్బందిని విచారిస్తున్న ఐటీ అధికారులు రెండో రోజు మంగళవారం కూడా విచారణ కొనసాగించారు.

ఐటీ అధికారుల ఎదుట ‘మల్లారెడ్డి’ సిబ్బంది

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, ఆయన విద్యా సంస్థల్లో పని చేస్తున్న సిబ్బందిని విచారిస్తున్న ఐటీ అధికారులు రెండో రోజు మంగళవారం కూడా విచారణ కొనసాగించారు. మొత్తం 16 మందికి సమన్లు జారీ చేసిన అధికారులు ఈనెల 28, 29 తేదీల్లో ఐటీ కార్యాలయంలోని అధికారుల ఎదుట విచారణకు హాజరుకావాలని పేర్కొన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మొదటి రోజు 12 మందిని విచారించిన ఐటీ అధికారులు వారి వద్ద సేకరించిన సమాచారంతో మరో పదిమందికి సమన్లు జారీ చేశారు. ఈ క్రమంలో ఐటీ అధికారుల విచారణ రెండోరోజు మంగళవారం కూడా కొనసాగింది. సమన్లు అందుకున్న మల్లారెడ్డి విద్యాసంస్థల సిబ్బంది, కుటుంబ సభ్యులు రెండో రోజు ఉదయం 11:30 నుంచే విచారణకు హాజరయ్యారు. రెండో రోజు విచారణకు హాజరైన వారిలో ఎక్కువ మంది మెడికల్‌, ఇంజనీరింగ్‌ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాల్స్‌, అకౌంటెంట్లే ఉన్నారు. మంత్రి మల్లారెడ్డి ఆడిటర్‌ సీతారామయ్యను ఐటీ అధికారులు 4 గంటలపాటు విచారించారు. రెండో రోజు విచారణలో ఐటీ అధికారులు పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలిసింది. మరోసారి మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి బుధవారం ఐటీ విచారణకు హాజరుకానున్నట్లు తెలిసింది.

Updated Date - 2022-11-30T03:56:06+05:30 IST