మహిళా పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేయండి

ABN , First Publish Date - 2022-07-18T05:52:31+05:30 IST

తెలంగాణలో మహిళా పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని

మహిళా పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న మల్లు లక్ష్మి

హయత్‌నగర్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మహిళా పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్‌ చేశారు. ఆదివారం నగర శివారు మన్నెగూడలో ఏర్పాటు చేసిన రంగారెడ్డి జిల్లా ఐద్వా విస్తృతస్థాయి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయన్నారు. నేటికి దేశ వ్యాప్తంగా ఏదో ఒక చోట మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మహిళల కోసం చేసిన చట్టాలు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయని విమర్శించారు. చట్టాలను కఠినతరం చేసి మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.  కేరళ ప్రభుత్వం మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం 14 రకాల సరుకులను రేషన్‌ షాపుల ద్వారా ఇవ్వాలని కోరారు. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి మహిళల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హమీ నేటికి అమలుకాక పోవడం దురదృష్టకరమన్నారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు విజయ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుమలత, మహిళా నాయకురాలు కవిత, విజయ, శారద, మమత, సంధ్య, ఉమా, లక్ష్మి, రత్నమ్మ పాల్గొన్నారు. Read more