బతుకు పోరులో జీవితం బలి

ABN , First Publish Date - 2022-11-30T03:59:27+05:30 IST

రోడ్లు ఊడ్చడానికి వచ్చిన అతడు జీతం తక్కువ అని పారిపోయి ఖర్జూరపు తోటలలో పనికి వెళ్ళాడు. విధి వక్రించడంతో తోటలో పనిచేస్తుండగానే గుండెపోటుతో చనిపోయాడు.

బతుకు పోరులో జీవితం బలి

దయనీయ స్థితిలో తెలుగు ప్రవాసీ మృతి

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

రోడ్లు ఊడ్చడానికి వచ్చిన అతడు జీతం తక్కువ అని పారిపోయి ఖర్జూరపు తోటలలో పనికి వెళ్ళాడు. విధి వక్రించడంతో తోటలో పనిచేస్తుండగానే గుండెపోటుతో చనిపోయాడు. పది రోజుల తర్వాత అతడి మృతదేహం లభించింది. అధికార ప్రక్రియను పూర్తి చేసి స్థానికంగా అంత్యక్రియలు నిర్వహించడానికి నెలన్నర రోజులు పట్టింది. నిజామాబాద్‌ జిల్లాలోని మల్లారం గ్రామానికి చెందిన షేక్‌ చాంద్‌ పాషా ఉపాధి కోసం సౌదీ అరేబియాకి వచ్చాడు. మదీనా మునిసిపాలిటీలో పారిశుధ్య పనికి కుదిరాడు. ఆ పని నచ్చకపోవడంతో బయట ఖర్జూరపు తోటలలో కలుపు మొక్కలు తీసే పనికి వెళ్లేవాడు. ఈ క్రమంలో పనికి వెళ్లిన అతడికి గుండెపోటు రావడంతో అక్టోబరు 16న మృతి చెందాడు. కొన్ని రోజులకు అటుగా వెళ్ళిన వారికి దుర్వాసన రావడంతో గుర్తించి సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి మృతదేహన్ని ఆస్పత్రికి తరలించారు. మృతదేహం కుళ్లిపోవడంతో గుర్తించడంలో జాప్యం జరిగింది. కుటుంబసభ్యులకు అధికార ప్రక్రియ గురించి తెలియకపోవడంతో ఈ జాప్యం మరింత ఎక్కువైంది. జెద్దాలో ఉంటున్న నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లికి చెందిన సామాజిక కార్యకర్త ఫారూఖ్‌ గత రెండు వారాలుగా చేసిన నిరంతర కృషి ఫలితంగా మంగళవారం మునిసిపాలిటీ అధికారులు మదీనాలో అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2022-11-30T03:59:27+05:30 IST

Read more