ఇందిరాపార్కు వద్ద ఎల్‌ఐసీఎఓఐ మహా ధర్నా

ABN , First Publish Date - 2022-12-10T00:47:52+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్‌ రెగ్యులేషన్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏ) డ్రాప్టును ఉపసంహరించుకునే వరకు పోరాటం చేయాలని, ఎల్‌ఐసీ ఏజెంట్లు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు.

ఇందిరాపార్కు వద్ద ఎల్‌ఐసీఎఓఐ మహా ధర్నా

తరలివచ్చిన 19 రాష్ట్రాల ఎల్‌ఐసీ ఏజెంట్లు

కవాడిగూడ, డిసెంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్‌ రెగ్యులేషన్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏ) డ్రాప్టును ఉపసంహరించుకునే వరకు పోరాటం చేయాలని, ఎల్‌ఐసీ ఏజెంట్లు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. దేశ ఆర్ధిక వ్యవస్థను అగ్రభాగాన నిలబెట్టడంలో ఎల్‌ఐసీ ఏజెంట్ల పాత్ర మహోన్నతమైందని పేర్కొన్నారు. ఇలాంటి వ్యవస్థను కాపాడాల్సిన ప్రభుత్వం, కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేస్తూ బంగాళాఖాతంలో కలిపివేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్‌ఐసీ ఏజెంట్ల సమస్యలను ప్రధాని, తెలంగాణ సీఎంకు లేఖల ద్వారా పంపించి వివరిస్తామని పేర్కొన్నారు. శుక్రవారం ఎల్‌ఐసీ ఏజెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీఎఓఐ) ఆధ్వర్యంలో ఐఆర్‌డీఏ డ్రాప్టును వ్యతిరేకిస్తూ ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. 19 రాష్ర్టాల నుంచి వచ్చిన ఎల్‌ఐసీ ఏజెంట్లు పాల్గొన్నారు. ప్లకార్డులతో డిమాండ్లను తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఎల్‌ఐసీ ఏఓఐ ఆలిండియా ప్రధాన కార్యదర్శి పీ.జీ.దీలీప్‌ మాట్లాడుతూ, ఐఆర్‌డీఏ డ్రాఫ్ట్‌ వల్ల ఎల్‌ఐసీ వ్యవస్థ పూర్తిగా కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్‌ఐసీ ఏఓఐ సౌత్‌జోన్‌ అధ్యక్షుడు ఎల్‌.మంజునాధ్‌, ప్రధాన కార్యదర్శి పీ.ఎల్‌.నరసింహారావు మాట్లాడుతూ, బీమా సుగం పేరుతో ఎల్‌ఐసీని నిర్వీర్యం చేసి కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. దీని ఫలితంగా లక్షలాదిమంది ఎల్‌ఐసీ ఏజెంట్లు ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మారే ప్రమాదం ఉందన్నారు. ఎల్‌ఐసీని స్థాపించిన నాటి నుంచి ఇప్పటివరకు కమీషన్లు పెంచకపోగా తగ్గించే చర్యలు చేపట్టడం దుర్మార్గమన్నారు. ఎల్‌ఐసీ ఏజెంట్లకు నష్టం కలిగించే కేంద్ర ప్రభుత్వ విధానాలను దేశ ప్రజలంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ ఆలిండియా వైస్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎంపీ వాసుదేవ్‌ ఆచార్య, ఏఐఐఈఏ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:47:53+05:30 IST