ఆరోగ్యశ్రీని కోమాలోకి నెట్టిన కేసీఆర్‌: షర్మిల

ABN , First Publish Date - 2022-12-30T03:42:40+05:30 IST

పేదలకు కార్పొరేట్‌ స్థాయిలో ఉచిత వైద్యం అందించే లక్ష్యంతో వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకాన్ని సీఎం కేసీఆర్‌ కోమాలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.

ఆరోగ్యశ్రీని కోమాలోకి నెట్టిన కేసీఆర్‌: షర్మిల

హైదరాబాద్‌, డిసెంబర్‌ 29(ఆంధ్రజ్యోతి): పేదలకు కార్పొరేట్‌ స్థాయిలో ఉచిత వైద్యం అందించే లక్ష్యంతో వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకాన్ని సీఎం కేసీఆర్‌ కోమాలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఇప్పటికే 104 సేవలను రద్దు చేసిన కేసీఆర్‌, ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా నిర్వీర్యం చేసే కుట్ర పన్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీని దేశం మొత్తం విస్తరించడానికి మీ ఖాతాలో రూ.వేల కోట్లుంటాయి కాని, పేదోడి ప్రాణం కాపాడేందుకు ఖజానాలో రూ.800 కోట్లు ఉండవా అని నిలదీశారు. సర్కారు నిధులు ఇవ్వడం లేదని ప్రతిసారి కార్పొరేట్‌ ఆసుపత్రులు వైద్యం ఆపుతూనే ఉండాలా అని షర్మిల ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని, ఆఖరికి వైద్యం అందించలేని స్థితికి తెలంగాణను తీసుకొచ్చారని షర్మిల విమర్శించారు. కేసీఆర్‌కు జ్వరం వస్తేకార్పొరేట్‌ ఆసుపత్రికి పోతారని, మరి పేదవాడికి రోగమొస్తే కాటికి పోవాల్సిందేనా? అని షర్మిల ప్రశ్నించారు.

Updated Date - 2022-12-30T03:42:40+05:30 IST

Read more