‘కరక్కాయ’ బాధితులకు చెక్కుల పంపిణీ

ABN , First Publish Date - 2022-07-18T06:02:49+05:30 IST

తమకు న్యాయం జరుగుతుందా..! పోగొట్టుకున్న డబ్బు తిరిగి

‘కరక్కాయ’ బాధితులకు చెక్కుల పంపిణీ

  • హైదరాబాద్‌ సిటీ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): తమకు న్యాయం జరుగుతుందా..! పోగొట్టుకున్న డబ్బు తిరిగి చేతికందుతుందా..! అని కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురుచూసిన కరక్కాయల బాధితులకు న్యాయం జరిగింది. గొలుసు కట్టు స్కీములతో దాదాపు 423 మంది నుంచి రూ. 7 కోట్లు కాజేసిన 10 మంది నేరగాళ్లను సైబరాబాద్‌ ఎకనమిక్‌ అఫెన్స్‌ వింగ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి డబ్బులు, స్థిరాస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు జప్తు చేసుకున్న ఆస్తులను కోర్టు ఆదేశంతో వేలం వేశారు. 

   ఇందుకోసం సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, రిటైర్డ్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జ్‌ జె.సాంబశివ్‌, డీసీపీలు కలమేశ్వర్‌ సింగన్‌వార్‌, డి.కవితతో కమిటీని నియమించారు. నేరగాళ్ల నుంచి రికవరీ చేసిన స్థిర, చరాస్తుల వేలం ద్వారా రూ. 73,53,577 వసూలయ్యాయి. వీటిని ఎల్‌బీనగర్‌ సెషన్స్‌ జడ్జి అధీనంలో ఉంచారు. చార్టెడ్‌ అకౌంటెంట్‌ కమిటీ నివేదిక ప్రకారం బాధితులకు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సైబరాబాద్‌ కమిషనరేట్‌లో 12 మంది బాధితులకు సీపీ  రవీంద్ర చెక్కులు అంజేశారు.

  మిగతా 281 మందికి వారి ఖాతాలో డబ్బు జమ చేసే ఏర్పాట్లు చేశారు. పారదర్శకంగా వేలం నిర్వహించి, బాధితులకు న్యాయం చేసిన సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం అధికారులను సీపీ స్టీఫెన్‌ రవీంద్ర అభినందించారు. పెట్టుబడి పెట్టే ముందు ఆయా సంస్థల గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని, అధిక వడ్డీ, బహుమతులంటూ ఆశ చూపి మోసం చేసే పథకాల్లో చేరవద్దని సీపీ సూచించారు.

Updated Date - 2022-07-18T06:02:49+05:30 IST