అది భార్య కుట్రే..!

ABN , First Publish Date - 2022-12-30T00:56:23+05:30 IST

వివాహేతర సంబంధానికి భర్త అడ్డు తగులుతున్నాడని, అతడిని భయపెట్టాలని భార్య తన ప్రియుడిని ఉసిగొల్పింది.

అది భార్య కుట్రే..!

గుర్తుతెలియని వ్యక్తుల దాడి కేసు..

9 నెలల తర్వాత అసలు నిజం వెలుగులోకి..

అప్పటికే బాధితుడి మృతి

నిందితుల అరెస్ట్‌ .. పరారీలో భార్య

హయత్‌నగర్‌, డిసెంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధానికి భర్త అడ్డు తగులుతున్నాడని, అతడిని భయపెట్టాలని భార్య తన ప్రియుడిని ఉసిగొల్పింది. దీంతో అతడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి అతన్ని చితక బాదా డు. బాధితుడు మూడు నెలల తర్వాత గుండెపోటుతో మృతిచెందాడు. మృతికి గతంలో జరిగిన దాడే కారణమని బాధితుడి సోదరుడి ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తొమ్మిది నెలల తర్వాత నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలిలా ఉన్నాయి. హయత్‌నగర్‌, శాంతినగర్‌లో నివాసం ఉంటున్న మాచర్ల శంకర్‌గౌడ్‌ కూకట్‌పల్లి బస్‌ డిపోలో కండక్టర్‌. హయత్‌నగర్‌ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న రజితను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే అదే డిపోలో ఆర్టీసీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వరుణ్‌ రాజ్‌కుమార్‌తో రజిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి భర్త శంకర్‌గౌడ్‌ ఆమెను మందలించాడు. దీంతో భర్తను భయపెట్టాలని రజిత ఆమె ప్రియుడు వరుణ్‌ రాజ్‌కుమార్‌ను కోరింది. వరుణ్‌ రాజ్‌కుమార్‌ మరో ఇద్దరు స్నేహితులు ఉమాకాంత్‌ (24), నీరజ్‌ (23)కు చెప్పి మార్చి 7న శంకర్‌గౌడ్‌పై దాడి చేయించాడు. ఆ మరుసటి రోజు రజిత ఏమీ తెలియనట్టుగా గుర్తుతెలియని వ్యక్తులు తన భర్తపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి నిందితులు పరారీలో ఉన్నారు. ఇదిలా ఉండగా శంకర్‌గౌడ్‌ జూన్‌ 11న ఇంట్లో బాత్‌రూంలో జారి కిందపడ్డాడు. తర్వాత గుండెపోటుతో చనిపోయాడు. తన సోదరుడి మృతికి గతంలో జరిగిన దాడి కారణమై ఉండొచ్చని శంకర్‌గౌడ్‌ తమ్ముడు రమేష్‌గౌడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రజిత ప్రియుడు వరుణ్‌ రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పడింది. రజిత కోరడంతోనే తన స్నేహితులతో శంకర్‌గౌడ్‌పై దాడి చేయించానని వరుణ్‌ వెల్లడించాడు. అతడితోపాటు ఉమాకాంత్‌, నీరజ్‌ను ఈనెల 21న పోలీసులు అరెస్టు చేశారు. రజిత పరారీలో ఉంది. శంకర్‌గౌడ్‌ బాత్‌రూంలో జారిపడిన ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. గుండె సంబంధిత వ్యాధితోనే శంకర్‌గౌడ్‌ మృతి చెందినట్లు ఎఫ్‌ఎ్‌సఎల్‌ నివేదికలో ఉందని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Updated Date - 2022-12-30T00:56:31+05:30 IST