అక్రమాలు.. అలానే!
ABN , First Publish Date - 2022-12-13T00:39:43+05:30 IST
గ్రేటర్లో 18వేల మంది వరకు అవుట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులున్నారు. 930 మందికిపైగా శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు (ఎస్‌ఎ్‌ఫఏ)లు కార్మికుల హాజరు తీసుకుంటారు.

కొనసాగుతోన్న బోగస్ హాజరు
కొత్త యంత్రాలొచ్చినా అదే తీరు..
పలు ప్రాంతాల్లో పాత మిషన్ల వినియోగం
మామూళ్లు ఇచ్చే వారికి మునుపటి యంత్రాలు
పారిశుధ్య కార్మికుల హాజరులో అక్రమాలు ఆగడంలేదు. కొందరు అధికారుల అండతో కిందిస్థాయి సిబ్బంది యథేచ్ఛగా అక్రమార్జన కొనసాగిస్తున్నారు. కార్మికుల బోగస్ హాజరుకు చెక్ పెట్టేలా కొత్త యంత్రాలను అందుబాటులోకి తీసుకు వచ్చినా.. ఇప్పటికీ పలు సర్కిళ్లలో పాత మిషన్లను వినియోగిస్తున్నారు. విధులకు రాని కార్మికులకు హాజరు వేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి.
హైదరాబాద్ సిటీ, డిసెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్లో 18వేల మంది వరకు అవుట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులున్నారు. 930 మందికిపైగా శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు (ఎస్‌ఎ్‌ఫఏ)లు కార్మికుల హాజరు తీసుకుంటారు. ఆది నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేసే పారిశుధ్య కార్మికుల లెక్కలపై అనుమానాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో 30శాతం వరకు కార్మికులు కాగితాల్లో మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. లేని కార్మికుల పేరిట వేతనాలు తీసుకుంటూ కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు, డిప్యూటీ మునిసిపల్ కమిషనర్లు, ఏఎంఓహెచ్‌లు, ఎస్‌ఎ్‌ఫఏలు వాటాలు వేసుకుని పంచుకుంటున్నట్టు గుర్తించారు. దీనికి చెక్ పెట్టేందుకు బయోమెట్రిక్ హాజరు విధానం గతంలో తెరపైకి తీసుకువచ్చారు.
సింథటిక్ ముద్రలతో..
బయోమెట్రిక్ హాజరు విధానం అమలులోకి వచ్చినా బోగస్ హాజరు ఆగలేదు. విధులకు రాకున్నా.. కార్మికుల ఇళ్ల వద్దకు వెళ్లి ఎస్‌ఎ్‌ఫఏలు హాజరు తీసుకునే వారు. ఈ విషయమూ బహిర్గతం కావడంతో నిర్ణీత ఏరియాలో మాత్రమే యంత్రం పనిచేసేలా, ఎక్కడ హాజరు తీసుకుంటున్నారన్నది గుర్తించేలా కొత్త సాంకేతికతను జోడించారు. అయితే, అధికారుల ఎత్తుకు కింది స్థాయి సిబ్బంది పై ఎత్తు వేశారు. సింథటిక్ వేలిముద్రలతో కార్మికులకు హాజరు వేయడం మొదలెట్టారు. సంస్థలోని విజిలెన్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. పలు సర్కిళ్లలో తొమ్మిది మంది ఎస్‌ఎ్‌ఫఏలను సింథటిక్ వేలిముద్రలతో సహా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విధుల నుంచి తొలగించారు. కొన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న సిబ్బంది తిరిగి బోగస్ హాజరు మొదలెట్టారు. ఈ క్రమంలోనే సింథటిక్ వేలిముద్రలు పని చేయకుండా అధికారులు కొత్తయంత్రాలను తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చారు.
అయినా.. పాత మిషన్లు
కొత్త యంత్రాలను ఎస్‌ఎ్‌ఫఏలకు అందజేసినట్టు కేంద్ర కార్యాలయంలోని ఐటీ విభాగం వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇప్పటికీ కొన్నిప్రాంతాల్లో పాతమిషన్ల ద్వారానే హాజరు తీసుకుంటున్నారు. వాస్తవంగా పాత మిషన్లు తీసుకొని కొత్తవి ఇవ్వాలి. అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికని, కొందరు వేలిముద్రలను కొత్త యంత్రాలు గుర్తించడం లేదనే కారణా లతో కొన్ని సర్కిళ్లలో వాటిని అధికారుల వద్ద ఉంచుకున్నట్టు తెలుస్తోంది. సింథటిక్ వేలిముద్రలతో బోగస్ హాజరు వేసే ప్రాంతాల్లో ఈ యంత్రాలను ఇప్పటికీ వినియోగిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. నెలనెలా మామూళ్లు ఇచ్చే ఎస్‌ఎ్‌ఫఏలకు ఈ యంత్రాలిచ్చి కొందరు ఏఎంఓహెచ్‌లు బోగస్ హాజరు దందాను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఖైరతాబాద్, అంబర్‌పేట, ముషీరాబాద్, గాజులరామారం, చార్మినార్, చాంద్రాయణగుట్ట, చందానగర్, మూసాపేట తదితర ప్రాంతాల్లో పలుచోట్ల పాత యంత్రాలు వినియోగిస్తున్నట్టు తెలిసింది. వీటితో తరచుగా హాజరు వేస్తోన్న సర్కిళ్లేవని పరిశీలిస్తే వాస్తవం తెలిసే అవకాశం ఉంది.
Read more