బ్యాంకు అప్పుగా బిల్లులు

ABN , First Publish Date - 2022-11-07T11:06:32+05:30 IST

ఆర్ధిక ఇబ్బందుల నేపథ్యంలో అభివృద్ధి, నిర్వహణ పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపునకు ప్రత్యా మ్నాయ మార్గాలను

బ్యాంకు అప్పుగా బిల్లులు

నిధుల లేమి నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ యోచన

ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తోన్న అధికారులు

బెంగళూరు విధానం అమలుకు కసరత్తు

ఈఆర్‌పీ తనఖా పెట్టుకొని రుణాలు ఇవ్వనున్న బ్యాంకులు

ఈఆర్‌పీ విలువలో 70 శాతం వరకు..

బిల్లుల చెల్లింపు అనంతరం వసూలు

వడ్డీ భారం కాంట్రాక్టర్లదే?

హైదరాబాద్‌ సిటీ: ఆర్ధిక ఇబ్బందుల నేపథ్యంలో అభివృద్ధి, నిర్వహణ పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపునకు ప్రత్యా మ్నాయ మార్గాలను జీహెచ్‌ఎంసీ పరిశీలిస్తోంది. నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉండడం.. కాంట్రాక్టర్లు పనులు నిలిపివేస్తుండడంతో ఈ ఇబ్బందులకు చెక్‌ పెట్టేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. బృహత్‌ బెంగళూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌(బీబీఎంసీ) తరహాలో బ్యాంకు రుణాల ద్వారా బిల్లులు చెల్లించేందుకు సాధ్యా సాధ్యాలు పరిశీలిస్తున్నారు. బిల్లుల చెల్లింపు క్రమంలో తుది దశలో రూపొందించే ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌ (ఈఆర్‌పీ) ఆధారంగా బెంగళూరులో కాంట్రాక్టర్లు బ్యాంకు రుణాలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఇదే పద్ధతిలో ఇక్కడా కాంట్రాక్టర్లు లోన్లు తీసుకునే వెసులుబాటు కల్పించాలని భావిస్తున్నారు. రహదారులు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, నిర్వహణ, ఇతరత్రా పనులకు సంబంధించి రూ.800 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో కీలకమైన వర్షాకాలంలో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. రోడ్లపై గుంతలు పూడ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో బకాయిలో కొంత చెల్లించిన జీహెచ్‌ఎంసీ.. విడతల వారీగా మొత్తం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అధికారుల హామీతో కాంట్రాక్టర్లు కొంత కాలంగా తిరిగి పని చేస్తున్నారు. మున్ముందు ఈ తరహ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈఆర్‌పీల ఆధారంగా బ్యాంకు రుణాలు తీసుకునే అవకాశం కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నారు.

ఈఆర్‌పీతో...

వివిధ పనులు చేసే కాంట్రాక్టర్లు.. ఆ వివరాలతో సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులకు బిల్లులు సమర్పిస్తారు. సాంకేతిక పరిశీలన అనంతరం ఇంజనీర్లు.. ఆర్థిక విభాగానికి ఫైల్‌ పంపుతారు. అక్కడి నుంచి ఆడిట్‌కు వెళ్తుంది.

ఆడిట్‌లో ఆ పనికి నిధుల మంజూరు ఎంత ఉంది..? ఎంత మేర పూర్తయ్యింది..? ఈఎండీ ఎంత..? ఒప్పందం ప్రకారం పనులు జరిగాయా..? లేదా..? అన్నది పరిశీలిస్తారు. అంతా సక్రమంగా ఉంటే బిల్లు ఈఆర్‌పీ కి వెళ్తుంది. అక్కడ తుది పరిశీలన పూర్తయిన అనంతరం అందుబాటులో ఉన్న నిధుల ఆధారంగా బిల్లులు చెల్లిస్తారు. ఈఆర్‌పీకి వెళ్లిందంటే బిల్లు చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు లేవని అర్ధం.

వడ్డీ భారం కాంట్రాక్టర్లదే..?

బెంగళూరులో ఈఆర్‌పీ తనఖా పెట్టుకొని బ్యాంకులు రుణాలు ఇస్తున్నట్టు చెబుతున్నారు. ఇక్కడా అదే విధానంలో లోన్లు తీసుకో నున్నారు. ఈఆర్‌పీ విలువలో 70 శాతం రుణాన్ని కాంట్రాక్టర్లు తీసుకునే అవకాశం ఉంటుందని ఓ అధికారి చెప్పారు. నిధులు అందుబాటులో ఉన్నప్పుడు జీహెచ్‌ఎంసీ చేసే చెల్లింపులు.. ఆ ఖాతాలో జమ చేస్తారు. వడ్డీతో కలిపి రుణం మొత్తాన్ని బ్యాంకు మినహాయించుకొని.. మిగతా డబ్బును కాంట్రాక్టర్‌కు ఇస్తుంది. రుణం తీసుకున్నప్పటి నుంచి చెల్లింపు వరకు వడ్డీ మొత్తాన్ని కాంట్రాక్టర్లు భరిస్తారని అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థలతో పోలిస్తే బ్యాంకు వడ్డీ తక్కువగా ఉండనున్న దృష్ట్యా.. కాంట్రాక్టర్లకూ ఉపయుక్తంగా ఉంటుందని ఓ అధికారి పేర్కొన్నారు. ఎస్‌బీఐలో ఖాతా ఉన్న కాంట్రాక్టర్లకు మాత్రమే ఈఆర్‌పీ ద్వారా రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుందని చెబుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనకు కసరత్తు చేస్తున్నారు.

Updated Date - 2022-11-07T11:06:38+05:30 IST

Read more