అత్యాచార కేసుల్లో బాధితురాలి స్టేట్‌మెంట్‌ను మహిళా మేజిస్ట్రేట్లే రికార్డు చేయాలి

ABN , First Publish Date - 2022-11-17T02:58:35+05:30 IST

అత్యాచార కేసుల్లో బాధితురాలి స్టేట్‌మెంట్‌ను మహిళా మేజిస్ట్రేట్లే రికార్డు చేయాలని దిగువ కోర్టులను హైకోర్టు ఆదేశించింది.

 అత్యాచార కేసుల్లో బాధితురాలి స్టేట్‌మెంట్‌ను మహిళా మేజిస్ట్రేట్లే రికార్డు చేయాలి

దిగువ కోర్టులకు హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): అత్యాచార కేసుల్లో బాధితురాలి స్టేట్‌మెంట్‌ను మహిళా మేజిస్ట్రేట్లే రికార్డు చేయాలని దిగువ కోర్టులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. అత్యాచార కేసులో దర్యాప్తు అధికారి అత్యాచార బాధితురాలిని ప్రవేశపెట్టిన రోజే సీఆర్పీసీ సెక్షన్‌ 164 ప్రకారం స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. సంబంధిత కోర్టులో మహిళా మేజిస్ర్టేట్‌ లేకపోతే సమీపంలో మహిళా మేజిస్ర్టేట్‌ ఉన్న కోర్టులో బాధితులను ప్రవేశపెట్టాలని పేర్కొంది. బాధితులు వచ్చిన రోజే స్టేట్‌మెంట్‌ రికార్డు పూర్తి కావాలని, వాయిదా వేయకూడదని స్పష్టం చేసింది. స్టేట్‌మెంట్‌ నమోదు చేసిన తర్వాత ఒక కాపీని దర్యాప్తు అధికారికి ఇవ్వాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ వివరాలు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చార్జిషీట్‌ దాఖలు చేసే వరకూ వివరాలు బయటకు పొక్కకుండా దర్యాప్తు అధికారికి సైతం ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని తెలిపింది. ఘటన జరిగిన 24 గంటల్లోగా బాధితురాలిని కోర్టులో ప్రవేశపెట్టకపోతే.. ఆలస్యానికి కారణాలతో సహా కేస్‌ డైరీ కాపీని దర్యాప్తు అధికారి నుంచి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు అమలయ్యేలా ఆయా జిల్లాల ఇన్‌చార్జి జడ్జిలు చర్యలు తీసుకోవాలని తెలిపింది.

Updated Date - 2022-11-17T02:58:36+05:30 IST