Megastar Chiranjeevi: రాజకీయాల్లో అనాలి.. అనిపించుకోవాలి!

ABN , First Publish Date - 2022-11-21T04:18:39+05:30 IST

రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం.. సెన్సిటివ్‌గా ఉంటే ఎదగలేం. రాజకీయాల్లో మాటలు అనాలి.. అనిపించుకోవాలి. చాలా మొరటుగా, కటువుగా ఉండాలి.

Megastar Chiranjeevi: రాజకీయాల్లో అనాలి.. అనిపించుకోవాలి!

సెన్సిటివ్‌గా ఉంటే రాణించడం కష్టం

ఈ విషయంలో పవన్‌ తగిన వాడు

ఏదో రోజు ఉత్తమ స్థానంలో ఉంటాడు

వైఎన్‌ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సినీ నటుడు చిరంజీవి

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ‘రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం.. సెన్సిటివ్‌గా ఉంటే ఎదగలేం. రాజకీయాల్లో మాటలు అనాలి.. అనిపించుకోవాలి. చాలా మొరటుగా, కటువుగా ఉండాలి. అప్పుడే రాణించే అవకాశం ఉంటుంది. ఇదంతా నాకు అవసరమా’ అని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. రాజకీయాల్లో పవన్‌ కల్యాణ్‌ తగినవాడని, మాటలు అంటాడు.. అనిపించుకుంటాడని చెప్పారు. ‘ఆయనకు మీరందరూ ఉన్నారు.. మీ అందరి ఆశీస్సులతో ఏదో ఒక రోజు అత్యుత్తమ స్థానంలో ఉంటాడ’ని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ఆదివారం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎర్రమిల్లి నారాయణమూర్తి (వైఎన్‌) కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి కాలేజీ పూర్వ విద్యార్థి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తనకు వైఎన్‌ కళాశాలలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పారు.

కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే తనకు నటనపై ఇష్టం ఉండేదని, ఒక నాటకం వేస్తే ఉత్తమ నటుడిగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. తర్వాత అమ్మాయిలు తనను చూస్తుంటే పెద్ద హీరోలా ఫీలయ్యేవాణ్ణి అని నవ్వుతూ చెప్పారు. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని అధిగమించి సినిమా రంగంలో నటుడిగా రాణించాలనే బలమైన నమ్మకానికి పునాది పడింది వైఎన్‌ కాలేజీలోనే అని తెలిపారు. ఎన్‌సీసీలో సీనియర్‌ కెప్టెన్‌ పొజిషన్‌ వరకు వెళ్లానని, 1976లో రిపబ్లిక్‌ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ తరఫున రాజ్‌పథ్‌లో మార్చింగ్‌ చేశానని గుర్తుచేసుకున్నారు. తనకు క్రమశిక్షణ వైఎన్‌ కాలేజీలోనే అలవడిందని, పాఠాలు కాదు.. జీవితాలు ఎలా చదవాలో ఇక్కడే నేర్చుకున్నానని చెప్పారు. తనకు డ్యాన్స్‌ విషయంలో గురువులు ఎవరూ లేరని, కానీ తాను బెస్ట్‌ డ్యాన్సర్‌నని అందరూ అంటారన్నారు.

పుస్తకాల నుంచే కాదు మన చుట్టూ ఉండే వారి నుంచీ నేర్చుకుంటూనే ఉండాలని చెప్పారు. ‘నా మనసుకు నచ్చితే దాని అంతు చూడటమనేది నాకు అలవాటుగా మారింది. నేను జీవితంలో అనుకున్నవన్నీ చేశా. కానీ.. ఒక్కదాంట్లో మాత్రం అంతు చూడలేకపోయాను. నా మనసులోనుంచి రాకపోతే దాని అంతు చూడలేను. అదేంటో మీ అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేద’ని పేర్కొన్నారు. అనంతరం చిరంజీవిని పూర్వ విద్యార్థులు, స్నేహితులు, కాలేజీ యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమై 4 గంటల వరకు కొనసాగిన సమ్మేళనంలో అన్ని బ్యాచ్‌ల విద్యార్థులు పాల్గొన్నారు. చిరంజీవి దాదాపు 4 గంటలపాటు పూర్వ విద్యార్థులతో కలిసి ఉండడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-11-21T09:11:14+05:30 IST