పనులు ప్రారంభించాకే ముఖం చూపిస్తా

ABN , First Publish Date - 2022-11-21T00:17:13+05:30 IST

పేదలు ఎక్కువగా నివసిస్తున్న జవహర్‌నగర్‌లో అంతర్గత రోడ్లు ఇంత అధ్వానంగా ఉన్నాయని అనుకోలేదు.

 పనులు ప్రారంభించాకే ముఖం చూపిస్తా

జవహర్‌నగర్‌, నవంబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): పేదలు ఎక్కువగా నివసిస్తున్న జవహర్‌నగర్‌లో అంతర్గత రోడ్లు ఇంత అధ్వానంగా ఉన్నాయని అనుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, పురపాలక మంత్రి కేటీఆర్‌లతో కొట్లాడైనా, కాళ్లు మొక్కైనా వారం రోజుల్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తా... అంతవరకు నా ముఖం మీకు చూపించను అని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం కార్పొరేషన్‌ పరిధిలోని 1, 2, 3, 17, 18, 19 డివిజన్లలో మేయర్‌ కావ్య, డిప్యూటీ మేయర్‌ శ్రీనివాస్‌, అదనపు జిల్లా కలెక్టర్‌ అగస్త్యన్‌, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ సంతో్‌షలతో కలిసి ఆయన పాదయాత్ర నిర్వహించారు.

సమస్యలు ఏకరువు...

పాదయాత్ర చేస్తున్న మంత్రి మల్లారెడ్డికి కాలనీవాసులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అంతర్గత రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, మట్టిరోడ్లతో నరకయాతన పడుతున్నామని, డ్రైనేజీ పైప్‌లైన్‌లు వేయకపోవడంతో మురుగు రోడ్లపైన ఏరులైపారుతుండటంతో దోమ లు పెరిగి జ్వరాలు వస్తున్నాయని, డంపింగ్‌ యార్డ్‌తో నీరు పూర్తిగా కలుషితమైందని నల్లా కనెక్షన్‌లు ఇవ్వడంలేదంటూ మంత్రికి వివరించారు.

కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి..

పాదయాత్రలో డివిజన్లలో ఉన్న సమస్యలను స్వయం గా తెలుసుకున్నానని మీ బాధలు చూస్తుంటే కళ్లలో నీరు తిరుగుతున్నాయని మంత్రి మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దిగులు చెందాల్సిన అవసరం లేదంటూ అన్ని సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. కార్పొరేటర్లు డివిజన్‌లో నెలకున్న సమస్యల పరిష్కరానికి దృష్టిసారించాలని పిలుపునిచ్చారు. 28 డివిజన్‌లలో ఉన్న ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పైప్‌లైన్లు వేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పేదల కష్టసుఖాలు తెలుకునేందుకే తొలిసారిగా పేదల బస్తీలలో పాదయాత్ర చేస్తున్నానన్నారు.

అభివృద్ధికి అడ్డుపడితే ఎవరినీ వదలిపెట్టం...

కార్పొరేషన్‌ ఏర్పడక ముందు కాంగ్రెస్‌ అధికారంలో అభివృద్ధిని గాలికొదిలేశారనీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాకే రూ. 60 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కానీ ప్రతిపక్షాలకు చెందిన నాయకులు ఓర్వలేక అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తు ఉరుకోమని హెచ్చరించారు. ప్రజాసమస్యల పరిష్కరానికి ప్రజల వద్దకు వస్తే ప్రతిపక్షాలు రాజకీయం చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. త్వరలోనే మోడల్‌ జవహర్‌నగర్‌గా రూపుదిద్దుతామన్నారు. ప్రధానరోడ్లు, చెరువుల ఆధునికీకరణ, హైమాస్‌ లైట్లు అన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతిఇంటిని క్రమబద్ధీకరిస్తామని, ఇంటి పన్నులు కట్టుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్‌ అందిస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కొండల్‌ముదిరాజ్‌, కార్పొరేటర్లు ఏకే.మురుగేశ్‌, జిట్టా శ్రీవాణీశ్రీనివా్‌సరెడ్డి, లావణ్యసతీ్‌షగౌడ్‌, శారదామనోధర్‌రెడ్డి, మునగాల సతీ్‌షకుమార్‌, నవీన్‌, వేణు, కో-ఆప్షన్‌ ఫారుఖ్‌, టీఆర్‌ఎ్‌స నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-21T00:17:17+05:30 IST