దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాలు అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-02-16T17:57:14+05:30 IST

దారి దోపిడీలకు పాల్పడుతున్న మూడు ముఠాలను ఎల్‌బీనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 14 సెల్‌ ఫోన్లు, ఓ కత్తి, కళ్లజోడు...

దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాలు అరెస్ట్‌


హైదరాబాద్/కొత్తపేట: దారి దోపిడీలకు పాల్పడుతున్న మూడు ముఠాలను ఎల్‌బీనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 14 సెల్‌ ఫోన్లు, ఓ కత్తి, కళ్లజోడు, ఆటో, బైక్‌, రూ. 2,700 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిలో ముగ్గురు మైనర్లు సహా ఆరుగురు ఉన్నారు. ఎస్‌హెచ్‌ఓ అశోక్‌రెడ్డి, డీఐ ఉపేందర్‌రావు తెలిపిన వివరాలు ప్రకారం ఎల్‌బీనగర్‌ కామినేని ఆస్పత్రి సమీపంలో ఫుట్‌పాత్‌పై జీవనం సాగిస్తున్న చందుర్పల్లి నర్సింహ(27) హమాలీ. ఆమూరి సుభాస్‌(20) ఆటో నడుపుతుండగా, అతడి భార్య ఆమూరి అలివేలు కూలీ పనులు చేస్తుంటారు. వీరు ముగ్గురు ముఠాగా ఏర్పడి రాత్రివేళ రోడ్డుపై ఒంటరిగా వెళ్తన్న వారిపై దాడి చేసి కత్తి చూపించి డబ్బులు, సెల్‌ఫోన్లు దోచుకునే వారు. 2016 నుంచి సుభాష్‌ సెల్‌ఫోన్ల స్నాచింగ్‌కు పాల్పడుతున్నాడు. అతడిపై సరూర్‌నగర్‌ పీఎ్‌సలో 3, హుమాయున్‌నగర్‌ పీఎ్‌సలో ఓ కేసు, హయత్‌నగర్‌లో 2 కేసులు ఉన్నాయి. హయత్‌నగర్‌ పరిధిలో సెల్‌ఫోన్ల దొంగతనం కేసులో సుభాష్‌, అలివేలు జైలుకెళ్లారు. ఇద్దరూ ఈ యేడాది జనవరి 28న జైలు నుంచి విడుదలయ్యారు. మళ్లీ నేరాల బాట పట్టారు. కామినేని చౌరస్తా వద్ద ఎల్‌బీనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 8 సెల్‌ఫోన్లు, కత్తి, రూ 1500 స్వాధీనం చేసుకున్నారు. 


చెడు అలవాట్లకు బానిసలై...

వనస్థలిపురం ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఆవేజ్‌(20), అవతపురం ప్రవీణ్‌(21), సిలివేరు ఆంజనేయులు(21) ముగ్గురు స్నేహితులు. చెడు అలవాట్లకు బానిసలై వీరు ముఠాగా ఏర్పడి దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ నెల 8న మన్సూరాబాద్‌కు చెందిన అంబటి నవీన్‌ సాయినగర్‌ మోర్‌ మార్కెట్‌లో విధులకు వెళుతున్నాడు. అతడిని బైక్‌పూ వెంబడిస్తూ నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే అడ్డగించి బెదిరించి రూ3200, ఇయర్‌ఫోన్స్‌ లాక్కుని వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదుతో డిటెక్టివ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంగళవారం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 సెల్‌ఫోన్‌, బైకు, రూ1200 స్వాధీనం చేసుకున్నారు. గతేడాది ఎన్‌డీపీఎస్‌ యాక్టుపై మహ్మద్‌ ఆవేజ్‌, ఆంజనేయులును వనస్థలిపురం పోలీసుల అరెస్టు చేశారు. 


ముగ్గురు మైనర్లు కూడా...

జల్సాలకు అలవాటుపడిన ముగ్గురు మైనర్లు దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. ఓ బాలుడి తండ్రికి చెందిన ఆటోను రాత్రివేళ వారు నడపుతూ బస్‌స్టాపుల వద్ద ఒంటరి వ్యక్తులను ఎక్కించుకుని నిర్మాణుష్యం ప్రాంతంలోకి తీసుకెళ్లి బెదిరించి డబ్బు, సెల్‌ఫోన్లు దోచుకుని పరారవుతున్నారు. ఎల్‌బీనగర్‌లో పోలీసుల వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4 సెల్‌ఫోన్లు, ఓ వాచీ, కళ్ల జోడు, ఆటో స్వాధీనం చేసుకున్నారు.

Read more