యునెస్కో వారసత్వ నగరంగా హైదరాబాద్‌

ABN , First Publish Date - 2022-11-30T03:02:10+05:30 IST

హైదరాబాద్‌ నగరాన్ని ప్రపంచ వారసత్వ నగరంగా యునెస్కో గుర్తింపు లభించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోందని రాష్ట్ర మునిసిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

యునెస్కో వారసత్వ నగరంగా హైదరాబాద్‌

గుర్తింపు పొందేందుకు ప్రత్యేక ప్రణాళికలు..

మార్చినాటికి 100% మురుగునీరు శుద్ధీకరణ గుర్తింపు పొందేందుకు ప్రత్యేక ప్రణాళికలు..

రాష్ట్రంలో వెయ్యి గురుకులాల ఏర్పాటు: కేటీఆర్‌

హైదరాబాద్‌/సిరిసిల, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగరాన్ని ప్రపంచ వారసత్వ నగరంగా యునెస్కో గుర్తింపు లభించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోందని రాష్ట్ర మునిసిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నగర అభివృద్ధిపై మంగళవారం నగరంలో ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో మన ఊరు-మనబడి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలపై సమీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ టోలిచౌకిలోని ఖులీకుతుబ్‌షా టూంబ్‌ వద్ద ఉన్న నడకబావి, కామారెడ్డిలోని దోమకొండ కోటలను ఇప్పటికే వారసత్వ కట్టడాలుగా యునెస్కో గుర్తించిందని మంత్రి గుర్తు చేశారు. ఇక్కడి వారసత్వ కట్టడాలను పరిరక్షించాలన్న లక్ష్యంగా మొజాంజాహీ మార్కెట్‌, సుల్తాన్‌బజార్‌ మహబూబ్‌ చౌక్‌లోని క్లాక్‌ టవర్‌, ఈఎ్‌సఐ చర్చి, రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌, షాఅలీ బండాను పునరుద్ధరించామని వివరించారు. చార్మినార్‌ చార్‌కమాన్‌, బన్సీలాల్‌పేట్‌ కమాన్‌, ఉప్పల్‌ కమాన్‌లను పునరుద్ధరణ పూర్తయిందన్నారు. కేవలం కట్టడాలనే మాత్రమే కాకుండా హైదరాబాద్‌ నగరాన్నే వారసత్వ నగరంలో యునెస్కో గుర్తించాలన్న లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. తమిళనాడు, కేరళ తర్వాత మూడో అతిపెద్ద పట్టణీకరణ రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు. హైదరాబాద్‌ నగర జనాభా ఎక్కువగా పెరుగుతున్నందున ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు.

మార్చి, ఏప్రిల్‌ నాటికి నగరంలోని 100% మురుగునీటిని శుద్ధీకరణ చేసేలా 31 సివరేజ్‌ ప్లాంట్లు ఏర్పాటుచేస్తున్నామని పేర్కొన్నారు. వీటిని రూ. 3866 కోట్లతో నిర్మిస్తున్నామని, దీంతో రోజుకు 1259 ఎంఎల్‌డీ మురుగునీటిని శుద్దీకరణ జరుగుతుందన్నారు. భారీ వర్షాలతో వరద సమస్య రాకుండా రూ. వెయ్యి కోట్లతో నాలాల విస్తరణ చేపడుతున్నామని వివరించారు. నగరంలో రోజుకు 6వేల మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోందని, వీటితో విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు జవహర్‌నగర్‌లో 48 మెగావాట్ల ప్లాంట్‌ సిద్ధం చేశామని, మరో 30 మెట్లవాట్ల కోసం నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఈ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే నగరంలో ఉత్పత్తి అయ్యే చెత్తతో విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని 68 మున్సిపాలిటీల్లో మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, ఈ ఆర్థిక సంవత్సరంలో ముగిసేలోపు అన్ని మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేయనున్నామని మంత్రి పేర్కొన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 200 గురుకులాలు ఉంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత వెయ్యికిపైగా ఏర్పాటు చేశామని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే తలమానికంగా నిలిచిందని ఆయన అన్నారు.

ఇండియాగేట్‌ వద్ద కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

ఢిల్లీలోని ఇండియా గెట్‌ వద్ద టీఆర్‌ఎస్‌ నేత అలిశెట్టి అరవింద్‌ నేతృత్వంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అరవింద్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ దీక్ష తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు అన్నారు.

ఖైదీ కార్డు.. నా గౌరవ చిహ్నం: కేటీఆర్‌

ప్రత్యేక రాష్ట్రం కోసం సాగించిన పోరాటం తనకు అత్యంత గౌరవనీయ అంశమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2009లో హన్మకొండలో జరిగిన ఆందోళనలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఆ సందర్భంగా పోలీసులు అరెస్టు చేసి వరంగల్‌ కేంద్ర కారాగారానికి తరలించారు. ఆ సందర్భంగా సెంట్రల్‌ జైలు ఇచ్చిన ఖైదీ గుర్తింపు కార్డు చిత్రాన్ని కేటీఆర్‌ మంగళవారం దీక్షా దివస్‌ సందర్భంగా ట్విటర్‌లో పోస్టు చేశారు. ఇదేరోజు 13 ఏళ్ల క్రితం నా గౌరవ చిహ్నం.. అంటూ పేర్కొన్నారు.

Updated Date - 2022-11-30T03:02:10+05:30 IST

Read more