నాలాలు ఇలా ..వరద పోయేదెలా!

ABN , First Publish Date - 2022-06-11T16:00:52+05:30 IST

నాలాల్లోని వ్యర్థాలను సంవత్సరం పొడవునా తొలగిస్తున్నామని చెబుతూ ఏటా రూ.45 కోట్లు జీహెచ్‌ఎంసీ ఖర్చు చేస్తోంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా

నాలాలు ఇలా ..వరద పోయేదెలా!

ఎక్కడికక్కడే వ్యర్థాలు

నాలాల్లో, పక్కనే డంపింగ్‌

పూడికతీత కాగితాల్లోనే..

మెజార్టీ ప్రాంతాల్లో తొలగించని వైనం

కుప్పలుగా దర్శనమిస్తోన్న చెత్తాచెదారం

ఏటా రూ.45 కోట్లు ఖర్చు

అయినా తప్పని ముంపు ముప్పు

కాలు కదపని ఉన్నతాధికారులు


వరద ప్రవాహ వ్యవస్థలో లోపాల వల్లే మహానగరం నీట మునుగుతోంది. ఆక్రమణలకు తోడు.. కొద్దో.. గొప్పో ఉన్న నాలాల గుండా కూడా వరద నీరు సాఫీగా వెళ్లే  పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ పేరుకుపోతున్న వ్యర్థాలు ప్రతి బంధకంగా మారుతున్నాయి. వాటి తొలగింపు, తరలింపులో అధికారుల నిర్లక్ష్యంతో ముంపు ముప్పు అధికమవుతోంది. గతం నుంచి గుణపాఠం నేర్చే అలవాటు లేని జీహెచ్‌ఎంసీ.. అలసత్వాన్ని మరోసారి ప్రదర్శిస్తోంది. పూడికతీత కోసం రూ. కోట్లు ఖర్చు చేస్తున్నా, నాలాల్లోని వ్యర్థాలు తగ్గడం లేదు. 


హైదరాబాద్‌ సిటీ: నాలాల్లోని వ్యర్థాలను సంవత్సరం పొడవునా తొలగిస్తున్నామని చెబుతూ ఏటా రూ.45 కోట్లు జీహెచ్‌ఎంసీ ఖర్చు చేస్తోంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఏ నాలాలో చూసినా వ్యర్థాల మేటలే. ప్లాస్టిక్‌, వస్త్రాలు, పరుపులు, దిండ్లతో పాటు మట్టి కుప్పలూ కనిపిస్తున్నాయి. మరి ఏడాదంతా పూడికతీత ఎక్కడ జరుగుతోంది, వ్యర్థాలు తీస్తున్నారా, తీసినట్టు కాగితాల్లోనే చూపుతున్నారా? తొలగించిన వ్యర్థాలు తరలిస్తున్నారా, ఎక్కడికక్కడే డంప్‌ చేస్తున్నారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పూడికతీతలో అవినీతి, అక్రమాలు జరుగుతాయన్న ఆరోపణలున్నా, ఇంజనీరింగ్‌ విభాగం ఉన్నతాధికారులు మొదలు కమిషనర్‌ వరకు పర్యవేక్షిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో తాము చేయించిందే పని, రాసిందే బిల్లు అన్నట్టుగా క్షేత్రస్థాయి ఉద్యోగులు ఇష్టానికి వ్యవహరిస్తున్నారు. వాస్తవంగా నాలాల్లో పూడిక తీసినా.. మరునాటికి ప్రవాహంతో పాటు వ్యర్థాలు వస్తుంటాయి. దీనినే అధికారులు సదవకాశంగా మార్చుకుంటున్నారు. చేయని పనిని చేసినట్టు.. వ్యర్థాలు తరలించకుండానే తరలించినట్టు చూపుతున్నారు. 


పూడిక తీయరు?

గ్రేటర్‌లో 370 కి.మీల మేర ప్రధాన నాలాలున్నాయి. 1400 కి.మీల వరకు డ్రెయిన్‌లు ఉంటాయన్నది అధికారుల లెక్క. వీటిలో ప్రవాహంతో పాటు వచ్చే వ్యర్థాలు ఎప్పటికప్పుడు తొలగించాలి. కానీ యంత్రాంగం తూతూ మంత్రంగా పూడికతీత పనులు చేస్తుండడంతో.. వర్షాకాలంలో ఇరువైపులా ఉండే కాలనీలు, బస్తీలు నీట మునుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించే కొన్ని ప్రాంతాల్లో మినహా మెజార్టీ ఏరియాల్లో వ్యర్థాల తొలగింపు దాదాపుగా జరగదని సంస్థలోని ఉద్యోగులు చెబుతున్నారు. రికార్డుల్లో మాత్రం పూడిక తొలగించినట్టు చూపుతుండడం గమనార్హం. బేగంపేట, అంబర్‌పేట, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాల్లో నాలాల్లో వ్యర్థాలు కుప్పలుగా పేరుకుపోయాయి. వర్షాకాలంలో ముంపు ముప్పునకు వ్యర్థాలు సక్రమంగా తొలగించకపోవడమే ప్రధాన కారణం. 


నాలా పనుల్లో నాణ్యత పాటించాలి

నాలాల పునరుద్ధరణ, విస్తరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. రూ.10.30 కోట్ల వ్యయంతో ఈర్ల చెరువు నుంచి జాతీయ రహదారి-65 వరకు చేపట్టిన నాలా పునరుద్ధరణ పనులను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. వర్షాకాలం ప్రారంభం కానున్న దృష్ట్యా.. పనులు జరుగుతోన్న చోట ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పురోగతిలో ఉన్న పనులు వీలైనంత త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఎస్‌ఎన్‌డీపీలో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.735 కోట్లతో 37 ప్రాంతాల్లో పనులు చేపట్టామని, శివారు మునిసిపాల్టీలు, కార్పొరేషన్లలో రూ.238 కోట్లతో 23 పనులు జరుగుతున్నాయని చెప్పారు. 

Read more