నిన్న ట్రా‘ఫికర్‌’.. నేడు బేఫికర్‌

ABN , First Publish Date - 2022-10-03T16:41:15+05:30 IST

దసరా పండుగను కుటుంబసభ్యులు, బంధువులు, ఆత్మీయుల నడుమ ఘనంగా జరుపుకొనేందుకు నగరంలో స్థిరపడ్డ పలువురు సొంత ఊర్లకు

నిన్న ట్రా‘ఫికర్‌’.. నేడు బేఫికర్‌

పండుగకు పయనమైన పట్నం

ఆదివారం కనిపించని ట్రాఫిక్‌ ప్రభావం

రైళ్లలో ఒక్కరోజే 5.20 లక్షల మంది

బస్సుల్లో మరో 2 లక్షలు 

హైదరాబాద్‌ సిటీ: దసరా పండుగను కుటుంబసభ్యులు, బంధువులు, ఆత్మీయుల నడుమ ఘనంగా జరుపుకొనేందుకు నగరంలో స్థిరపడ్డ పలువురు సొంత ఊర్లకు బయలుదేరుతున్నారు. మూడు రోజులుగా రైళ్లు, బస్సులు, సొంత వాహనాల్లో పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. దీంతో గ్రేటర్‌లో ట్రాఫిక్‌ తీవ్రత తగ్గింది. నిన్నా మొన్నటి వరకు వేలాది వాహనాలతో రద్దీగా మారి గ్రిడ్‌లాక్‌ అయిన రోడ్లన్నీ ఆదివారం కాస్త ప్రశాంతంగా కనిపించాయి. ట్రాఫిక్‌కు కేరాఫ్‌ అడ్ర్‌సగా పేరొందిన జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, జేఎన్‌టీయూ, కూకట్‌పల్లి, మియాపూర్‌, మూసాపేట, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, సికింద్రాబాద్‌, మెహిదీపట్నం, టోలీచౌకి, తదితర రోడ్లపై ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రాఫిక్‌ సాఫీగా సాగింది. సాయంత్రం ఆరు తర్వాత ఆయా మార్గాల్లో మోస్తరు ట్రాఫిక్‌ కనిపించింది.


కరోనా తర్వాత..

కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా పెద్ద పండుగలకు నగరవాసులు తమ సొంతూళ్లకు వెళ్లలేకపోయారు. ఈసారి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడంతో కుటుంబ సమేతంగా స్వగ్రామాలకు తరిలారు. దీంతో నగరంలోని జూబ్లీ బస్టాండ్‌, ఎంజీబీఎ్‌సతోపాటు సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. శుక్ర, శనివారాల్లో రైళ్లలో నగర పరిధిలోని నాలుగు స్టేషన్ల మీదుగా దాదాపు 9.50లక్షల నుంచి 10 లక్షల మంది వరకు ప్రయాణించగా, ఆదివారం ఒక్కరోజే 5.20లక్షల మంది వరకు రాకపోకలు సాగించినట్లు రైల్వేవర్గాలు వెల్లడించాయి. ఆర్టీసీ బస్సుల్లో గత రెండు రోజుల్లో సుమారు 5.80లక్షల మంది వెళ్లగా, ఆదివారం 2 లక్షల మంది వెళ్లినట్లు సమాచారం.


 శివార్ల నుంచి  బస్సులు

బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 600కు పైగా ప్రత్యేక బస్సులు ఏపీ, తెలంగాణ జిల్లాలకు వెళ్లాయని రంగారెడ్డి రీజియన్‌ మేనేజర్‌ ఎ.శ్రీధర్‌ తెలిపారు. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు తక్కువ సమయంలో వారి స్వగ్రామాలకు చేరుకునేలా ఆదివారం శివారు ప్రాంతాల నుంచి ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. అలాగే, 766 ప్రత్యేక బస్సులను సోమవారం సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2022-10-03T16:41:15+05:30 IST