మైనర్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసులో..నిందితులు ఇద్దరేనా?

ABN , First Publish Date - 2022-09-17T17:44:24+05:30 IST

డబీర్‌పురా పీఎస్‌ పరిధిలో మైనర్‌పై సామూహిక అత్యాచారం కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాంగ్‌రేప్‌లో ఇద్దరు మాత్రమే కాకుండా ఇతరుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

మైనర్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసులో..నిందితులు ఇద్దరేనా?

బాలికను అనుమతించిన లాడ్జి ఓనర్‌, సిబ్బందిపై చర్యలేవీ?

ఆమె అదృశ్యమైన 48 గంటల వరకు పోలీసులు ఏం చేశారు? 

బాధితురాలి ఇంటికి ఫోన్‌ చేసిన మూడో వ్యక్తి ఎవరు?

ఇష్టపూర్వకంగానే వెళ్లిందన్న ప్రచారం వెనుక ఉద్దేశం  ఏంటి? 

అన్నీ అనుమానాలే 


హైదరాబాద్‌ సిటీ: డబీర్‌పురా పీఎస్‌ పరిధిలో మైనర్‌పై సామూహిక అత్యాచారం కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాంగ్‌రేప్‌లో ఇద్దరు మాత్రమే కాకుండా ఇతరుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముందు నుంచే కేసును నీరు గార్చే ప్రయత్నం జరుగుతోందని, గ్యాంగ్‌ రేప్‌ వెలుగులోకి రాగానే.. బాలిక ఇష్టపూర్వకంగానే వెళ్లిందని డబీర్‌పురా ఇన్‌స్పెక్టర్‌ చెప్పినట్లు సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. మరోవైపు బాలిక మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన వెంటనే పోలీసులు అన్ని పీఎ్‌సలకు సమాచారం చేరవేసి ఉంటే అత్యాచారం జరిగేది కాదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. 


లాడ్జిలపై చర్యలేవీ?

ఈ కేసులో బాధిత బాలికను లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. ఇద్దరు యువకులు ఓ మైనర్‌ను వెంటబెట్టుకుని రాగా వారికి రూమ్‌ కేటాయించిన స్రుజన స్టే ఇన్‌ హోటల్‌ (ఓయో)పై చర్యలు తీసుకున్నట్లు కానీ.. వారిపై కేసు నమోదు చేసినట్లు కానీ పోలీసులు ప్రకటించలేదు. రెండు రోజుల పాటు బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఇద్దరితో పాటు వారికి సహకరించిన లాడ్జి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రాథమిక అంశాన్ని ఉన్నతాధికారులు విస్మరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


దర్యాప్తు చేశారా? 

బాఽధిత బాలికను తాము రక్షించి తీసుకొచ్చామని మీర్‌చౌక్‌ ఏసీపీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. వాస్తవంగా బాలిక నేరుగా ఇంటికి వచ్చేసిందని, ఆమె చెబితేనే విషయం తెలిసిందని బాలిక కుటుంబీకులు చెబుతున్నారు. రెండు రోజుల పాటు ఓ మైనర్‌ కిడ్నాప్‌, అత్యాచారానికి గురైతే.. ఆమె తిరిగొచ్చిన తర్వాత.. తాము తీసుకొచ్చామని చెబుతున్న పోలీసుల తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాలిక తిరిగొచ్చే సమయంలో ఆమె తల్లికి ఆగంతుకుడి నుంచి కాల్‌ వచ్చింది. దీంతో ఇద్దరు నిందితులతో పాటు మూడో వ్యక్తి ఉన్నాడని తెలుస్తోంది. ప్రతీ చిన్న విషయానికి ఫోన్‌ లొకేషన్స్‌, సాంకేతికత వినియోగించే పోలీసులు కాల్‌ చేసిన వ్యక్తిని గుర్తించలేదు. ఓవరాల్‌గా ఈ కేసును నిందితులిద్దరికీ పరిమి తం చేసి చేతులు దులుపుకోడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలిక ఇష్ట పూర్వకంగానే వెళ్లిందనే ప్రచారం వెనక ఏదో మతలబు ఉందని తెలుస్తోంది. ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. 

Updated Date - 2022-09-17T17:44:24+05:30 IST